ఆధార్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ఆధార్ సవరణ బిల్లు 2019ను లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లుపై సభలో వాడివేడిగా చర్చ మొదలైంది. ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లును సమాచార, ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ సభలో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం సంబంధిత వ్యక్తుల అనుమతితో అథెంటికేషన్ ద్వారా గానీ, ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ ద్వారాగానీ ఆధార్ నంబర్‌ను స్వచ్ఛందంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డు ద్వారా లబ్ధిదారులకు నేరుగా పథకాలు అందించడంతో ప్రభుత్వానికి రూ.7.48 లక్షల కోట్లు ఆదా అయ్యాయని మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. దళారులు కాజేస్తున్న ఈ సొమ్ములను కాపాడుకోగలిగామన్నారు. ఆధార్ చట్టంలో సవరణల ద్వారా ఓ పిల్లాడికి 18 ఏళ్లు నిండిన తర్వాత కావాలంటే తన ఆధార్ నంబర్‌ను రద్దు చేసుకునేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. దేశంలో మొత్తం 130 కోట్ల మందికి గానూ ప్రస్తుతం 123 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయని, ఇప్పటికే 69.38 కోట్ల మొబైల్ ఫోన్‌లు ఆధార్‌తో అనుసంధానం అయ్యాయని వివరించారు. అలాగే 65.91 కోట్ల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం అయ్యిందని తెలిపారు.
మరోవైపు తాము తీసుకొచ్చిన ఆధార్ కార్డును ఉపయోగించుకుంటూ కేంద్రం గొప్పలు చెప్పుకుంటోందని కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత ఆధిర్ రంజన్ చౌదరి ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మాటిమాటికీ ఆర్డినెన్సులు తెచ్చి పబ్బం గడుపుకుంటోందంటూ విమర్శించారు. దీనికంటే ముందు ప్రభుత్వం సమాచార భద్రత బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు. పౌరుల గోప్యతకు కేంద్రం ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వడం లేదంటూ చౌదరి ఫైర్ అయ్యారు. ఆధార్ సవరణ బిల్లులో పేర్కొన్న ‘డేటా పర్యవేక్షణ’ అనేది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందనీ.. దీన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పంపాలని కొన్ని పార్టీలు డిమాండ్ చేశాయి. చివరకు మూజువాణి ఓటుతో ఆధార్ సవరణ బిల్లు లోక్‌సభ ఆమోదించింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com