ఆంధ్రప్రదేశ్

ఇసుకదొంగల మాయాజాలం

ఇసుకదొంగల మాయాజాలం
X

కృష్ణాతీరంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ప్రకృతి సంపదను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని చెబుతుంటే.. మరోవైపు దర్జాగా నదీగర్భాన్ని ప్రొక్లెయిన్లతో తవ్వేస్తున్నారు అక్రమార్కులు. ప్రభుత్వ పనుల పేరుచెప్పి టిప్పర్లకొద్ది ఇసుకను ప్రైవేట్ పనులకు తరలిస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఇసుకదొంగల మాయాజాలంపై టీవీ5 ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్..

ఏపీలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అన్నట్లు తయారైంది పరిస్థితి. రాత్రి పగలు అనే తేడా లేకుండా దర్జాగా ప్రొక్లెయిన్లు పెట్టి మరీ నదీగర్భాన్ని తోడేస్తున్నారు. టిప్పర్లు పెట్టి తరలిస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం కొత్త ఇసుక విధానంపై కసరత్తు చేస్తోంది. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని చెబుతోంది. కానీ ఇవన్నీ కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయి. ఎన్ని ఆంక్షలున్నా ఇసుకాసురులు వెనక్కి తగ్గడంలేదు. తమకు కావాల్సినంత ఇసుకను తవ్వేసుకుంటున్నారు..

ఇది కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కాసరబాద ఇసుక క్వారీ. కలెక్టరు అనుమతులు చూపించి ఇక్కడి నుంచి టిప్పర్ల ద్వారా ఇసుకను భారీ ఎత్తున తరలిస్తున్నారు. పైకి ప్రభుత్వ పనుల కోసం అని చెబుతూ..ప్రైవేట్ పనులకు వాడుతున్నారు..వాస్తవానికి కొత్త ఇసుక విధానం వచ్చేంతవరకు నదీ ప్రరివాహక ప్రాంతంలో ఇసుక తరలింపుపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా దర్జాగా తవ్వేస్తోంది ఇసుక మాఫియా.

జీవీఆర్-ప్రేమ్ కో అనే కంపెనీ కోసం 11 వేల 760 క్యూబిక్ మీటర్లు ఇసుక తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు ఆర్డర్ కాపీ చూపుతున్నారు. ఈ పేరుతో 12 రోజులుగా నాన్ స్టాప్ గా నది లోంచి తోడుతూనే ఉన్నారు. ఇప్పటికే టిప్పర్లకొద్దీ ఇసకను తరలించారు. ఇంతా జరుగుతున్నా మైనింగ్ అధికారులు కానీ, పోలీసులుకానీ అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

గృహ అవసరాల కోసం ఇసుకను తరలిస్తే వెంటనే కేసులు పెడుతారు. కానీ ఇంత పెద్ద ఏత్తున ఇసుకను తోడేస్తూ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మిసొమ్ము చేసుకుంటున్నా ఎవరూ కిక్కురుమనడం లేదు..అధికార పార్టీ అండదండలతోనే ఇదంతా జరుగుతోందని నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆరోపిస్తున్నారు..పైకి కలెక్టర్ ఆర్డర్లు చూపుతూ.. ఇష్టానుసారంగా ఇసుకను తరలిస్తున్న మాఫియాపై ఇకనైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు....

Next Story

RELATED STORIES