మామ ఊళ్ళో అల్లుడి హడావిడి..త్వరలోనే..

మామ ఊళ్ళో అల్లుడి హడావిడి..త్వరలోనే..

చింతమడక.. ఇటీవల కాలంలో ట్రెండింగ్ అవుతున్న గ్రామం. రాత్రికి రాత్రి వందల మంది వర్కర్స్ ప్రత్యక్షమయ్యారు. రోడ్లు, వాటర్, డ్రైనేజీ పనుల వేగంగా చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణం ఊపందుకుంది. ఆలయం ప్రతిష్టకు సిద్దమవుతోంది. అక్కడ ఎవరిని పలకరించినా.. ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ చొరవతో జరుగుతోంది. పుట్టిన ఊరుపై కేసీఆర్ దృష్టిపెట్టారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన ఊరు చింతమడక. పలుమార్లు ఓటేయడానికి కేసీఆర్ ఇక్కడకు వచ్చినా గ్రామంలో ఎప్పుడూ పర్యటించలేదు. ఎర్రవెల్లి గ్రామం దత్తత తీసుకుని.. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్ ఇప్పుడు పుట్టినగడ్డపై దృష్టి సారించారు. త్వరలోనే పర్యటిస్తానని ప్రకటించారు. గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే హరీష్ రావు, కలెక్టర్ వెంకట్రామిరెడ్డిలను ఆదేశించారు. అంతే యంత్రాంగం అంతా కదిలింది. గ్రామంలో వాలిపోయింది. ఇంటింటికి వెళ్లి సమగ్ర సర్వే చేశారు. ఎవరికి ఏ అవసరాలు ఎంటో తెలుసుకుంటున్నారు. నివేదిక సిద్దం చేసి సీఎం కార్యాలయానికి పంపాలని ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు గ్రామంలోని సమస్యలు పరిష్కరించేందుకు పనులు శరవేగంగా సాగుతున్నాయి. మిషన్ భగీరథ ఎప్పుడో పూర్తైనా గ్రామానికి తాగునీరు అందలేదు. కానీ రెండురోజుల్లో పరిస్థితి మారిపోయింది. ఇంటింటికి నల్లా బిగిస్తున్నారు. పైప్ లైన్లలో లోపాలను సరిచేస్తున్నారు. మెగా సంస్థకు చెందిన సిబ్బంది, కార్మికులు రంగంలో దిగారు. 24 గంటలపాటు గ్రామంలో పనులు సాగుతూనే ఉన్నాయి. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ కూడా మెరుగపరుస్తున్నారు.

గ్రామంలో చాలాకాలంగా పెండింగ్ ఉన్న పనులు సైతం వేగంగా పూర్తి అవుతున్నాయి. గ్రామంలో ఆలయ నిర్మాణం చాలాకాలంగా జరుగుతోంది. నిధుల సమస్యతో కొంతకాలంగా పనులు ఆగిపోయాయి. ఈ పనులు కూడా వేగంగా పూర్తిచేసి.. సీఎం చేతుల మీదుగా ఆలయ ప్రతిష్టాపన చేయాలని గ్రామస్తులు భావిస్తున్నారు.

గ్రామంలో ఎలాంటి సమస్య ఉండకూడదని.. వెంటనే పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని నేరుగా సీఎం కేసీఆర్ గ్రామ సర్పంచ్ కు ఫోను చేసి మరీ చెప్పారు. అవసరమైన నిధులు వెంటనే అధికారులు మంజూరు చేస్తారని భరోసా ఇచ్చారు. గ్రామం అభివృధ్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం దిశా నిర్దేశం చేశారని... ఇది నిజంగా గ్రామ అదృష్టమంటున్నారు సర్పంచ్ హంసకేతన్ రెడ్డి.

గ్రామంలోమౌలిక వసతులతో పాటు.. ప్రధాన సమస్యపై దృష్టిసారించారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు అంతంతమాత్రమే. దీంతో కుటుంబాన్ని ఆదుకోవడానికి గ్రామానికి చెందిన దాదాపు 10శాతం మంది లేక గల్ఫ్ దేశాలకు వలసవెళ్లారు. సమగ్ర సర్వే ద్వారా వారిని గుర్తించారు. వీరితో పాటు.. గ్రామంలో ఉపాథి లేక నిరుద్యోగులుగా ఉన్న యువత వివరాలు కూడా సేకరిస్తున్నారు. వారికి నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులకు వ్యవసాయం లాభసాటి చేసేందుకు యంత్రాలను ఇచ్చేందుకు జాబితా సిద్దం చేస్తున్నారు. 40మంది కూరగాయల రైతులకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నారు. వాణిజ్య పంటలు వేసే వారికి ట్రాక్టర్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. పాడిసాగుపట్ల ఆసక్తి ఉన్నవారికి బర్రెలు, ఆవుల యూనిట్ల కోసం ఆర్ధిక సాయం చేయనున్నారు.

Tags

Next Story