రిటైర్మెంట్ ప్రకటించిన భాగ్యనగరం అల్లుడు

పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అంతర్జాతీయ వన్డేలకు గుడ్ బై చెప్పాడు. బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌తో పాక్ గెలిచి ఘనంగా టోర్నీ నుంచి నిష్కమించింది. ఈ మ్యాచ్‌లో మాలిక్‌కు ఆడకపోయినప్పటికి ఆటగాళ్లు అతనికి ఘనంగా వీడ్కోలు పలికారు. మాలిక్‌కు సహచరులు వీడ్కోలు పలుకుతున్న వీడియోను ఐసీసీ ‘క్రికెట్ వరల్డ్‌కప్’ అధికారిక ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అంతర్జాతీయ వన్డేల నుంచి రిటైర్ అవుతున్నట్లు అంతకు ముందు మాలిక్ సైతం ట్విటర్‌లో ప్రకటించారు. "ఈ రోజు అంతర్జాతీయ వన్డేల నుంచి రిటైర్ అవుతున్నాను. నా క్రికెట్ ప్రయాణంలో నాకు సహకారం అందించిన తోటి ఆటగాళ్లు,కోచ్‌లు, కుటుంబ సభ్యులు,మిత్రులు, మీడియా, స్పాన్సర్స్, ముఖ్యంగా నా అభిమానులకు ధన్యవాదాలు. లవ్ యూ ఆల్" అంటూ ట్విట్ చేశాడు. 1999లో తొలి వన్డే ఆడిన మాలిక్ 20 ఏళ్ల కెరీర్‌లో 287 వన్డేల్లో పాక్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 34.55 సగటుతో 7,534 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 39.19 సగటుతో 158 వికెట్లు పడగొట్టాడు.
మాలిక్ అంతర్జాతీయ వన్డేలకు గుడ్‌బై చెప్పడంపై భార్య సానీయా మీర్జా స్పందించారు. "ప్రతీ కథకు ఓ ముగింపు ఉంటుంది. ఆ ముగింపు ఓ కొత్త ఆరంభానికి నాంది అవుతుంది. మాలిక్ 20 ఏళ్లు నీ దేశం గర్వపడేలా ఆడావు. నీ ప్రయాణం ఎంతో గౌరవంగా, వినయంగా సాగింది. మీరు సాధించిన ప్రతి మైలురాయిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను" అని సానియా మీర్జా ట్వీట్ చేసింది. 2010 ఏప్రిల్‌లో సానియా- మాలిక్‌లు వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ జంటకు ఈ మధ్యే ఓ కొడుకు పుట్టాడు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com