ఆర్థిక పద్దుపై ప్రశంసల జల్లు కురిపించిన అధికార పక్షం.. పెదవి విరిచిన ప్రతిపక్షాలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై మోదీ సర్కారు ప్రశంసల వర్షం కురిపించింది. ఈ బడ్జెట్ ద్వారా మధ్య తరగతి వర్గానికి మేలు జరుగుతుందన్నారు ప్రధాని మోదీ. పన్ను విధానాన్ని సులభతరం చేశామని, మౌలిక వసతుల కల్పనలో సరికొత్త అభవృద్ధిని చూడబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. యువతకు మేలు జరుగుతుందని, వ్యవసాయ రంగంలో విప్లవాలకు నాంది పలికేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందని, నవభారతానికి ఇదొక రోడ్‌మ్యాప్‌లా ఉపయోగపడుతుందని తెలిపారు.
బడ్జెట్ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా ఉందన్నారు జాతీయ రహదారులు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ. పేద, మధ్యతరగతి వారికి ఆమోదయోగ్యమని చెప్పారు మరో కేంద్ర మంత్రి పియూష్ గోయల్. రానున్న పదేళ్లలో రైల్వేలో దాదాపు 50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా బడ్జెట్ రూపకల్పన ఉందన్నారాయన. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కితాబిచ్చారు. BJP మిత్రపక్షాల నాయకులు కూడా వార్షిక బడ్జెట్‌పై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల హమీలను నెరవేర్చేదిశగా బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశారని ప్రశంసించారు. మరోవైపు బడ్జెట్‌పై ప్రతిపక్షాలు ఎప్పటిలాగే పెదవి విరిచాయి. కొత్తసీసాలో పాత సారా అన్నట్లుగా బడ్జెట్ ఉందని ఎద్దేవా చేశాయి. నవీన భారతం గురించి పదే పదే మాట్లాడుతున్న మోదీ సర్కారు, ఉద్యోగాల సృష్టి-ఉపాధి కల్పనకు కొత్తగా పథకాలు గానీ, నిర్ణయాలు గానీ ప్రకటించలేదని లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరీ విమర్శించారు.
బడ్జెట్ దేశంలోని అన్ని వర్గాల ప్రజలను నిరాశపర్చిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం. పెట్రోల్, డీజిల్ సహా ఇతర వస్తువులపై అదనపు పన్నులు విధించడాన్ని తప్పుబట్టారాయన. బడ్జెట్ ప్రతులను లెదర్ బ్యాగ్‌లో కాకుండా, ఎర్రటి పార్సిల్ కవర్‌లో తీసుకురావడాన్ని కూడా ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో తమ పార్టీకి చెందిన కేంద్రమంత్రి ఐపాడ్ ద్వారా బడ్జెట్‌ను ప్రవేశపెడతారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బడ్జెట్‌లో మాటలే తప్ప చేతలు లేవని మరో సీనియర్ కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబల్ మండిపడ్డారు. బడ్జెట్‌లో విజన్ లోపించిందని, కేంద్రం పూర్తిగా పట్టాలు తప్పిందని మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ప్రధానంగా పెట్రోల్, డీజిల్‌పై సెస్ వేయడమే కాకుండా, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ రుద్దడం సామాన్యులకు ఎన్నికల బహుమతిగా ఎద్దేవా చేశారామె. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అటు రవాణారంగం నుంచి మార్కెట్ వరకూ, అక్కడ్నించి వంటగది వరకూ ప్రభావం చూపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు మహిళా ఆర్థిక మంత్రి ప్రవేశపెడుతోన్న బడ్జెట్ పట్ల స్త్రీలు చాలా అంచనాలు పెట్టుకున్నారని, వారి నమ్మకం వమ్మయిందన్నారు కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య. ప్రజల ఆశలపై నీళ్లు కుమ్మరించేలా బడ్జెట్ ఉందని విమర్శించారాయన.
బడ్జెట్ దేశంలోని కార్పొరేట్ శక్తులకు, వారి ఆర్థిక ప్రయోజనాలకు ఇచ్చిన నజరానా మాత్రమేనని సీపీఎం పొలిట్‌బ్యూరో విమర్శించింది. కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వర్గాల ప్రయోజనాలకు సంబంధించి ఒక్క మాట కూడా లేదని మండిపడింది. జాతీయ రహదారులు, రైల్వేలు, మెట్రోల అభివృద్ది వంటి వివిధ రంగాలలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానాన్ని ప్రోత్సహించే విధంగా 'ఫైనాన్షియబుల్ మోడల్'ను ఆవిష్కరించారని తెలిపింది. మొత్తమ్మీద బడ్జెట్‌లో పెద్దగా మెరుపులు లేవని, అలాగని నిరాశజనకంగా కూడా లేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com