సర్కారు ఉంటుందా?.. కూలుతుందా? మరో 48 గంటల్లో..

సర్కారు ఉంటుందా?.. కూలుతుందా? మరో 48 గంటల్లో..

కర్ణాటకలోని జేడీఎస్‌– కాంగ్రెస్‌ సంకీర్ణానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. 48 గంటల్లో సర్కారు ఉంటుందా.. కూలుతుందా అన్నది తేలిపోనుంది. నిన్న 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఇప్పటికే ఓ MLA రాజీనామా స్పీకర్ దగ్గర పెడింగ్‌లో ఉంది. వీళ్ల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే కుమారస్వామి ప్రభుత్వం మైనార్టీలో పడుతుంది. ఐతే.. MLAల రాజీనామాలను ఆమోదించడానికి స్పీకర్ మంగళవారం వరకూ సమయం తీసుకుంటానని చెప్పడంతో ఉత్కంఠ నెలకొంది. నిన్న స్పీకర్‌కు రాజీనామా ఇచ్చాక.. నేతలంతా రాజ్‌భవన్‌లో గవర్నర్‌ వాజూభాయ్‌ వాలాను కలిశారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు తగట్టు పనిచేయనందునే తాము రాజీనామాలు చేసినట్టు చెప్పుకొచ్చారు. ఆపరేషన్‌ కమల్‌ లాంటిదేమీ లేదని.. తామంతా ప్రభుత్వ వైఖరి నచ్చగే బయటకు వచ్చినట్టు స్పష్టం చేశారు. అటు, రాజీనామాలు సమర్పించిన కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ముంబై వెళ్లారు. ఈ క్యాంప్‌లోకి త్వరలో మరికొందరు చేరే అవకాశం కనిపిస్తోంది.

కాంగ్రెస్‌లో ట్రబుల్‌ షూటర్‌, మంత్రి డీకే శివకుమార్‌ పరిస్థితి చక్కదిద్దేందుకు రంగంలోకి దిగారు. రెబల్‌ ఎమ్మెల్యేల బృందాన్ని లీడ్ చేస్తున్న రామలింగారెడ్డితో మాట్లాడారు. వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ వేణుగోపాల్‌ కూడా బెంగళూరు చేరుకుని.. దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఐతే.. రెబల్ ఎమ్మెల్యేలు తిరిగి తమకే మద్దతిస్తారని మాజీ సీఎం సిద్ధరామయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నామని.. స్పీకర్ నిర్ణయం లోపు అంతా సర్దుకుటుందని చెప్పారు. అటు, ఈ పరిణామాలన్నింటిపై బీజేపీ నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు. కుమారస్వామి ప్రభుత్వ సంక్షోభంతో తమకు ఎలాంటి సంబంధం లేదని యడ్యూరప్ప చెప్తున్నారు. కాంగ్రెస్, జేడీఎస్‌ అంతర్గత కుమ్ములాటలే దీనికి కారణమంటున్నారు.

కర్ణాటక అసెంబ్లీలోని 224 మంది సభ్యులకుగాను మ్యాజిక్ ఫిగర్ 113. ప్రస్తుతం కాంగ్రెస్-JDS కూటమికి 118 మంది బలముంది. 14 మంది రాజీనామాలతో ఇప్పుడు కలవరం మొదలైంది. 14 మంది రిజైన్‌లు ఆమోదిస్తే సభలో సంఖ్యాబలం 210కి తగ్గుతుంది. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 105 అవుతుంది. ఈ లెక్కన చూస్తే అవసరమైన దానికంటే ఒక సభ్యుడు కూటమికి తక్కువవుతారు. మరికొందరు కూడా తిరుగుబాటు చేస్తే కుమారస్వామి సర్కారు కూలిపోయినట్టే. ప్రస్తుతం అమెరిగా పర్యటనలో ఉన్న ఆయన.. హుటాహుటిన బెంగళూరు వస్తున్నారు. సాయంత్రానికి ఆయన అక్కడికి చేరుకోగానే.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు కాంగ్రెస్ నేతలు.

ప్రస్తుతం సభలో అతిపెద్ద పార్టీగా బీజేపీయే ఉంది. ఆ పార్టీకి 105 మంది సభ్యులున్నారు. ఐతే.. కాంగ్రెస్, జేడీఎస్, బీఎస్పీ, ఇద్దరు ఇండిపెండెంట్లతో ప్రభుత్వం కొనసాగుతోంది. కాంగ్రెస్‌కి 78 మంది, జేడీఎస్‌కి 37 మంది మంది ఎమ్మెల్యేలుంటే ఒక బీఎస్పీ, ఇద్దరు స్వంతంత్ర ఎమ్మెల్యేలు కూడా మద్దతివ్వడంతో కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. కూటమి తొలిరోజు నుంచి సంక్షోభాలు కొనసాగుతూనే ఉన్నా ఇప్పుడు ఏకంగా 14 మంది రాజీనామాలతో ఇది చివరి అంకానికి చేరింది.

Tags

Read MoreRead Less
Next Story