వరల్డ్‌ కప్‌ సెమీస్‌.. చరిత్ర మరోసారి పునరావృతం కాబోతోంది..

వరల్డ్‌ కప్‌ సెమీస్‌.. చరిత్ర మరోసారి పునరావృతం కాబోతోంది..

ఈ వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో చరిత్ర మరోసారి పునరావృతం కాబోతోంది. అవును 2008 అండర్‌ 19 ప్రపంచకప్‌ సెమీస్‌లోనూ పోటీపడ్డ కోహ్లీ, విలియమ్సన్‌.. ఈ నెల మాంచెస్టర్‌ వేదికగా జరగనున్న వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్లో మరోసారి తలపడబోతున్నారు. ఈ ఘటనను అరుదైనదిగా చెప్పుకుంటున్నారు క్రికెట్ లవర్స్‌.

2008 అండర్‌ 19 ప్రపంచకప్‌ సందర్భంగా కోహ్లీ టీమిండియాకు, విలియమ్సన్‌ న్యూజిలాండ్‌ జట్టుకు నాయకత్వం వహించాడు. మలేషియా వేదికగా జరిగిన ఆ టోర్నిలో రెండు జట్లు సెమీఫైనల్స్‌లో పోటీపడ్డాయి. ఇందులో కోహ్లీసేన మూడు వికెట్ల తేడాతో గ్రాండ్‌ విక్టరీ కొట్టి ఫైనల్ చేరింది.

ఆనాడు కౌలాలంపూర్‌ వేదికగా జరిగిన సెమీస్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకొని 205 పరుగులు చేసింది. సీజే ఆండర్‌సన్‌ 70 పరుగులు, విలియమ్సన్‌ 37 పరుగులతో టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా వర్షం కురవడంతో.. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 43 ఓవర్లకు 191 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. కోహ్లీ 43 పరుగులు, ఎస్‌పీ గోస్వామి 51 పరుగులు చేసి... 41.3 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో ఇద్దరు సారథులు మరోసారి ప్రపంచకప్‌ సెమీస్‌కి చేరారు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్న కోహ్లీసేన... నాలుగోస్థానంలో న్యూజిలాండ్‌తో మంగళవారం పోటీపడనుంది. మరోసారి విలియమ్సన్‌పై కోహ్లీ పై చేయి సాధించి హిస్టరీని రిపీట్‌ చేస్తాడో లేదో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story