కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆయన పేరును సూచిస్తున్న ఎమ్మెల్యేలు
కర్ణాటక రాజకీయాలు ఉత్కంఠను రేపుతున్నాయి. క్షణక్షణానికి పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. సంకీర్ణప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్- జేడీఎస్ నేతలు ఆపసోపాలు పడుతున్నారు. అమెరికా నుంచి హుటాహుటీన వచ్చిన సీఎం కుమారస్వామి బెంగళూరులోని తాజ్ వెస్ట్ హోటల్ తో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. తాజా పరిస్థితులపై వారితో చర్చిస్తున్నారు. అటు కాంగ్రెస్ కూడా అప్రమత్తమైంది. మంగళవారం సీఎల్పీ మీటింగ్ నిర్వహించనుంది. సమావేశానికి హాజరుకానివారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది...కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ -జేడీఎస్ చీఫ్ దేవేగౌడతో సమావేశం అయ్యారు..ముంబయిలోని పలువురు అసంతృప్తులతో డీకే మాట్లాడినట్లు తెలుస్తోంది. వారికి మంత్రి పదవులు ఆఫర్ చేసినట్లు సమాచారం. ముంబయి హోటల్ లో మకాం వేసిన రెబల్ నేత నాగేంద్రను బెంగళూరు రావాలంటూ పిలిచారు.....ఆయన ద్వారా మిగతావారితోనూ రాయబారం నడుపుతారని తెలుస్తోంది..
అటు రాజీనామా చేసిన పలువురు ఎమ్మెల్యేలు తమ డిమాండ్లను వినిపిస్తున్నారు. సిద్ధరామయ్యను సీఎంగా ప్రకటిస్తే వెనక్కి వస్తామని లీకులిస్తున్నారు. లేదంటే కాంగ్రెస్ లేదా జేడీఎస్ నుంచి మరోనేతను ముఖ్యమంత్రిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత సీఎం కుమారస్వామిని ఏమాత్రం అంగీకరించేది లేదని పరోక్షంగా చెబుతున్నారు. అటు ఈ పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు జేడీఎస్ చీఫ్ దేవేగౌడ. ప్రస్తుత సంక్షోభానికి కాంగ్రెస్ నేత సిద్ధరమాయ్యే కారణం అని ఆరోపించారు. ఈమేరకు కాంగ్రెస్ హైకమాండ్ కు కూడా ఆయన ఫిర్యాదు చేశారు....
ముఖ్యమంత్రి మార్పుపైనా జోరుగా ప్రచారం సాగుతోంది. కుమారస్వామి స్థానంలో సిద్ధరామయ్య పేరును సూచించారు రెబల్ ఎమ్మెల్యేలు . అటు మల్లికార్జున ఖర్గేపేరు కూడా రేసులో వినిపిస్తోంది. ఇక ప్రస్తుత మంత్రివర్గాన్ని పూర్తిగా ప్రకాళన చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పై ఇప్పటికే గుర్రుగా ఉన్న జేడీఎస్ ఈ ప్రతిపాదనలకు ఒప్పుకుంటుందా అన్నది ఉత్కంఠను రేపుతోంది. తనను కాకుండా మరెవరిని సీఎంగా ప్రకటించిన మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు కుమారస్వామి. అటు రెబల్ ఎమ్మెల్యేలు కుమారస్వామిని అంగీకరించే ప్రసక్తే లేదని చెబుతున్నారు..ఎవరూ వెనక్కి తగ్గపోతే ప్రభుత్వం పడిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది బీజేపీ. ఇప్పటికే ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఫోకస్ చేసింది. బెంగళూరులోని ఓ హోటల్లో ఏకంగా 30 రూమ్స్ ని బుక్ చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com