కర్ణాటకలో రాజకీయ సంక్షోభం.. ఆ హోటల్ లో ఎమ్మెల్యేలు

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం.. ఆ హోటల్ లో ఎమ్మెల్యేలు

కర్ణాటక రాజకీయాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. క్షణక్షణానికి పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.13 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో ఉలిక్కిపడిన సీఎం కుమారస్వామి.. తన అమెరికా పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని హుటాహుటీన ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడి నుంచి వెంటనే ప్రత్యేక ఫ్లైట్ లో బెంగళూరు బయల్దేరారు. రాత్రి జేడీఎస్ శాసనసభాపక్షం అత్యవసరంగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అటు మంగళవారం కాంగ్రెస్ శాసనసభా పక్షం కూడా భేటీ కానుంది. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దినదినగండంగానే సాగుతోంది. అసలే అరకొర మెజార్టీతో నెట్టుకొస్తున్న కుమారస్వామి ప్రభుత్వం.. తాజా రాజీనామాలతో మైనార్టీలో పడిపోయింది.. ఇప్పటికే 13 మంది రాజీనామాలు చేశారు.. మరో 10 మంది కూడా అదే దారీలో ఉన్నరాన్న వార్తలు వస్తున్నాయి...

సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలపుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్ శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. ఇరు పార్టీలకు చెందిన సీనియర్లు విస్తృతంగా మంతనాలు జరుపుతున్నారు. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు...అటు ఈ రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కన్నడనాట ట్రబుల్ షూటర్‌గా పేరొందిన కాంగ్రెస్ నేత డీకే శివ కుమార్ రంగంలోకి దిగారు. జేడీఎస్ అధినేత దేవెగౌడను కలిశారు. ఎమ్మెల్యేల రాజీనామా, సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభంపై చర్చించారు. రాజీనామా చేసిన కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు ముంబైలోని సోఫిటెల్ హోటల్‌లో ఉన్నారు.వారిని ఎలాగైనా సంప్రదించి, ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ముంబైలో కాంగ్రెస్, JDS ఎమ్మెల్యేలు బసచేసిన హోటల్ వద్ద బీజేపీ నేతలు కనపడటం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతా కమలనాథుల కనుసన్నల్లోనే నడుస్తోందన్న కాంగ్రెస్ ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లైంది. అటు హోటల్ చుట్టూ ప్రైవేట్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మీడియాను కూడా అనుమతించడం లేదు. ఇదే సమయంలో సోఫిటెల్ హోటల్ నుంచి బీజేపీ ఎమ్మెల్సీ ప్రసాద్ బయటకు వచ్చారు. అయితే తాను బీజేపీ మెంబర్ షిప్ డ్రైవ్ తో బిజీగా ఉన్నానని...కర్ణాటక రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చారు.

అటు కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది...పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని మాజీ సీఎం సిద్ధరామయ్య ఫైరయ్యారు..ఇది ఆపరేషన్ కమలంలో భాగమేనన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన సంకీర్ణ ప్రభుత్వానికి ఏమీ కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అటు రిజైన్ చేసిన ఎమ్మెల్యేలంతా తిరిగి వస్తారని..ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని మిగతా కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు...

కాంగ్రెస్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది..ఈ సంక్షోభంతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్ని పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో చూడాలన్నారు యడ్యూరప్ప...

ప్రస్తుతం బంతి కర్ణాటక స్పీకర్ కోర్టులో ఉంది..ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిన్న చేసిన 13 మందితోపాటు.. ఇప్పటికే మరో ఎమ్మెల్యే రాజీనామా స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉంది. ఈ 14 మంది ఇచ్చిన రిజైన్ లెటర్స్ పై మంగళవారం నిర్ణయం తీసుకోనున్నారు స్పీకర్. ఆయన ముందు పలు ఆప్షన్స్ ఉన్నాయి. రాజీనామాలను వెంటనే ఆమోదించడం లేదా వాయిదావేయడం లేదంటే ఎమ్మెల్యేలను వివరణ కోరడం చేయవచ్చు. రాజీనామాలను ఆమోదిస్తే కుమారస్వామి సర్కారు మైనార్టీలో పడిపోతోంది.

Tags

Read MoreRead Less
Next Story