కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి కౌంట్ డౌన్.. డీకే శివ కుమార్ కు..

కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి కౌంట్ డౌన్.. డీకే శివ కుమార్ కు..

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం..పీక్ స్టేజ్ కి చేరింది.! దినదిన గండంగా సాగుతున్న కాంగ్రెస్-JDS సంకీర్ణ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ దగ్గరపడుతోంది. శనివారం రాజీనామాలు చేసిన 13 మంది ఎమ్మెల్యేల్లో ఎవరూ వెనక్కితగ్గడంలో లేదు. రాజీనామాలను వెనక్కి తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు. అటు మరో పది మంది కూడా ఇదే బాటలో ఉన్నారన్న వార్తలు సంకీర్ణప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే అటు కాంగ్రెస్, ఇటు జేడీఎస్ తరపున...సీనియర్లు రంగంలోకి దిగారు.. ఉదయం నుంచి వరుససమావేశాలతో విస్తృతంగా చర్చలు జరపుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గే అటు జనతాదళ్‌ నేత దేవెగౌడ పార్టీ నేతలతో సమాలోచనలు చేస్తున్నారు..

అటు ఈ రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కన్నడనాట ట్రబుల్ షూటర్‌గా పేరొందిన కాంగ్రెస్ నేత డీకే శివ కుమార్ రంగంలోకి దిగారు. జేడీఎస్ అధినేత దేవెగౌడను కలిశారు. ఎమ్మెల్యేల రాజీనామా, సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభంపై చర్చించారు. రాజీనామా చేసిన కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు ముంబైలోని సోఫిటెల్ హోటల్‌లో ఉన్నట్లు తెలుసుకున్న డీకే.. వారిని ఎలాగైనా సంప్రదించి, ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కన్నడనాట కాంగ్రెస్, JDSల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో శివ కుమారే కీ రోల్ పోషించారు.

అటు కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి.. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది...పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని మాజీ సీఎం సిద్ధరామయ్య ఫైరయ్యారు..ఇది ఆపరేషన్ కమలంలో భాగమేనన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన సంకీర్ణ ప్రభుత్వానికి ఏమీ కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అటు ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ఇప్పటికే రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.. రిజైన్ చేసిన వారందరూ తిరిగి వెనక్కి వచ్చేస్తారని.. ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు...

కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి పెను గండం పొంచిఉంది..కర్ణాటక అసెంబ్లీలోని 224 మంది సభ్యులున్నారు. మ్యాజిక్ ఫిగర్ 113. ప్రస్తుతం కాంగ్రెస్-JDS కూటమికి 118 మంది బలముంది. 14 మంది రాజీనామాలతో ఇప్పుడు కలవరం మొదలైంది. 14 మంది రిజైన్‌లు ఆమోదిస్తే సభలో సంఖ్యాబలం 210కి తగ్గుతుంది. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 105 అవుతుంది. ఈ లెక్కన చూస్తే అవసరమైన దానికంటే ఒక సభ్యుడు కూటమికి తక్కువవుతారు. మరికొందరు కూడా తిరుగుబాటు చేస్తే కుమారస్వామి సర్కారు కూలిపోయినట్టే. ప్రస్తుతం సభలో అతిపెద్ద పార్టీగా బీజేపీయే ఉంది. ఆ పార్టీకి 105 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్‌కి 78 మంది, జేడీఎస్‌కి 37 మంది మంది ఎమ్మెల్యేలుంటే ఒక బీఎస్పీ, ఇద్దరు స్వంతంత్ర ఎమ్మెల్యేలు కూడా మద్దతివ్వడంతో కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. కూటమి తొలిరోజు నుంచి సంక్షోభాలు కొనసాగుతూనే ఉన్నా ఇప్పుడు ఏకంగా 14 మంది రాజీనామాలతో ఇది చివరి అంకానికి చేరింది.

Tags

Read MoreRead Less
Next Story