భారీగా పెరిగిన పెట్రోల్ ధర.. తెలంగాణలో ఎంతంటే..

భారీగా పెరిగిన పెట్రోల్ ధర.. తెలంగాణలో ఎంతంటే..

కేంద్ర బడ్జెట్‌లో సామాన్యులపై భారం పెంచారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తీసుకొచ్చి భారం తగ్గిస్తారని భావిస్తున్న సమయంలో.. సెస్ విధించి అదనపు భారం పెంచారు. ఇంధనంపై ఎక్సైజ్ సుంకం రూపాయి పెంచడం ద్వారా పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రజల నుంచి ఆగ్రహావేశాలు తప్పడం లేదు.

కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచిన సుంకం వల్ల పెట్రోల్ 2 రూపాయల 50 పైసలు పెరగనుంది. డీజిల్ రెండు రూపాయల 30 పైసలు పెరుగుతుంది. దీని వల్ల ప్రభుత్వానికి 28వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుంది. ప్రజల జేబుల్లో నుంచి అదనంగా గుంజుతున్న మొత్తం ఇది. అటు కేంద్రంతో పాటు.. పెరిగిన ధరపై వ్యాట్ రూపంలో రాష్ట్రాల్లో కూడా సామాన్యుల జేబులు గుల్ల చేయనున్నాయి. తెలంగాణలో పెట్రోలుపై రెండు రూపాయల 60 పైసలు, డీజిలుపై రెండు రూపాయల 56 పైసలు పెరిగింది. ప్రజలపై ఏడాదికి 1,095 కోట్లు అదనపు భారం పడుతుంది.

పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం విధించిన సెస్ కారణంగా ప్రజలపై ధరాభారం పడనుంది. ప్రయాణ ఛార్జీల నుంచి నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయి. ఒక్క తెలంగాణలోనే 4వందల కోట్ల వరకూ ప్రజలపై అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. గడిచిన ఐదేళ్లుగా ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు పెంచుతూ వస్తుంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా కూడా ధరలు మాత్రం పెంచుతూ వచ్చాయి. 2013-14లో కేంద్ర ప్రభుత్వానికి పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా వచ్చిన ఆదాయం కేవలం 88వేల 5వందల కోట్లు. కానీ 2018- 19లో 2 లక్షల కోట్లకు పెరిగింది. అంటే ఏ స్థాయిలో పన్నులు పెంచుతుందో అర్ధం చేసుకోవచ్చు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుసార్లు సుంకం తగ్గిస్తే... 10సార్లు పెంచారు.

ఎంత పన్నులు పెంచినా దేశవ్యాప్తంగా పెట్రోలియం, డీజిల్‌ ఉత్పత్తుల విక్రయాలు తగ్గుముఖం పట్టడం లేదు. అవసరాలకు అనుగుణంగా గణనీయంగా పెరుగుతోంది. పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్‌ రికార్డు స్థాయికి చేరుకుంటోంది. ఆయిల్‌ దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ముందువరసలో ఉంది. ప్రపంచంలో అత్యధికంగా వినియోగిస్తున్న దేశాల్లో మూడోస్థానంలో ఉంది. నెలకు సగటున 7.5 మిలియన్‌ టన్నుల డీజిల్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. గత ఏడాది పెట్రోల్‌ అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. నెలకు సగటున 2.45 మిలియన్‌ టన్నుల పెట్రోల్‌ విక్రయాలు జరుగుతున్నాయి.

చాలాకాలంగా పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్టి పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ ఉంది. అలా చేస్తే నిత్యావసరాలు ధరలు గణనీయంగా తగ్గుతాయని... రవాణా భారం కూడా ఉండదని సామాజికవేత్తలు అంటున్నారు. అయినా దీనిపై అటు రాష్ట్రాలు, ఇటు కేంద్రం ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. ఎవరికి వారు ఆదాయం కోసం జిఎస్టీ ఊసెత్తడం లేదు. ప్రజలపై భారం తగ్గించాలని కోరుతుంటే.. మరింత పెంచుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story