అంత్యక్రియలు చేస్తున్న సమయంలో.. బిడ్డకు ప్రాణం పోసిన అమ్మ పిలుపు

అంత్యక్రియలు చేస్తున్న సమయంలో.. బిడ్డకు ప్రాణం పోసిన అమ్మ పిలుపు

అమ్మపిలుపు ఓ ప్రాణాన్ని నిలబెట్టింది. అమ్మ కన్నీళ్లతో బ్రెయిన్‌ డెడ్‌ అయింది అనుకున్న బిడ్డ ప్రాణం లేచి వచ్చింది. అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్న సమయంలో.. అమ్మ పిలుపు మళ్లీ జీవం పోసింది. ఈ అద్భుత ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.

సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి గ్రామానికి చెందిన గంధం సైదమ్మకు ఇద్దరు కుమారులు. 14 ఏళ్ల కిందట భర్త ఉపేందర్‌ అనారోగ్యంతో మృతి చెందాడు. పెద్ద కుమారుడు డిగ్రీ చదువుతున్నాడు. చిన్న కుమారుడు కిరణ్‌కు జూన్‌ 26న వాంతులు, విరేచనాలవడంతో సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో జూన్‌ 28న కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

కిరణ్‌కు మూడు రోజులు చికిత్స అందించిన వైద్యులు.. బ్రెయిన్‌ డెడ్‌ అయిందని, వెంటిలేటర్‌ తీయగానే చనిపోతాడని చెప్పి డిశ్చార్జి చేశారు. దీంతో ఇక చేసేది లేక బంధుమిత్రులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 3న పిల్లలమర్రికి చేరుకున్న అంబులెన్సు నుంచి అచేతనంగా ఉన్న కిరణ్‌ను దించారు. శ్వాస ఆగకపోవడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. అచేతనవస్థలో ఉన్న కొడుకును చూసి అతడి తల్లి కన్నీరుమున్నీరు అయ్యింది. గుండెలు బద్దలయ్యేలా రోధించింది.. తల్లి ఏడుపులు విన్న బిడ్డ గుండె కొట్టుకుంటుండడం మొదలైంది. దీంతో తల్లి కిరణ్ అని పిలవగా అతడి కంటి నుంచి కన్నీరు కారింది.

కొడుకు బతుకుతాడనే ఆశ కలిగిన సైదమ్మ గ్రామంలోని ఆర్‌ఎంపీ వైద్యుడిని తీసుకొచ్చింది. హైదరాబాద్‌ వైద్యుల సూచనలతో ఆయన వైద్యం అందించారు. నాలుగు రోజులు అలాగే చికిత్స అందించడంతో ఐదో రోజునకిరణ్‌లో కదలికలు వచ్చాయి. కొద్దికొద్దిగా చూడటం, మాట్లాడటం మొదలుపెట్టాడు. చనిపోతాడని భావించిన కొడుకు బతకడంతో తల్లి, కుటుంబసభ్యులు, బంధుమిత్రుల ఆనందానికి హద్దులు లేవు. ఆ బాలుడు మృత్యువు అంచుల వరకూ వెళ్లినా అమ్మ మాట అతడి ప్రాణాలు నిలబెట్టిందని తెలియడంతో.. గ్రామస్థులంతా ఆశ్చర్యానికి, ఆనందానికి గురవుతున్నారు..

Tags

Read MoreRead Less
Next Story