బెంగళూరులోని హోటల్లో ఏకంగా ౩౦ రూమ్స్‌ని బుక్ చేసి..

బెంగళూరులోని హోటల్లో ఏకంగా ౩౦ రూమ్స్‌ని బుక్ చేసి..

కర్ణాటక రాజకీయ సంక్షోభం మరింత రసవత్తరంగా మారింది. కాంగ్రెస్‌, జనతాదళ్‌కు చెందిన 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో ఒక్కసారిగా కుదుపునకు లోనైన సంకీర్ణ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్,జేడీఎస్ అగ్రనేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెబల్స్‌లో కొందరిని వెనక్కి తీసుకురాగలిగినా ప్రస్తుతానికి గట్టెక్కగలుగుతామని భావిస్తున్నారు. అయితే రెబల్స్‌లో మాత్రం ఎవరూ ఇందుకు సముఖంగా లేరు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కుమారస్వామి ఆగమేఘాలమీద బెంగళూరు చేరుకున్నారు. రాత్రి 7 గంటలకు నగరానికి చేరుకున్న ఆయన జనతాదళ్‌ శాసనసభాపక్ష సమావేశంలోనూ, అనంతరం కాంగ్రెస్‌ నాయకులతోనూ సమావేశమయ్యారు. కేవలం 14 మంది ఎమ్మెల్యేల కోసం రాజీనామా చేయనని ఆయన తేల్చిచెప్పారు. అదే సమయంలో నష్టనివారణ చర్యలను ప్రతిపాదించారు. ‘

ఎమ్మెల్యేల రాజీనామాల నేపథ్యంలో శనివారమే బెంగళూరుకు వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కె.సి.వేణుగోపాల్‌ ఆదివారం చర్చలు కొనసాగించారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డాక్టర్‌ జి.పరమేశ్వర్‌, మంత్రి డి.కె.శివకుమార్‌తో నిరంతర చర్చల్లో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్‌ అసమ్మతిదారులను దారికి తెచ్చే బాధ్యతను వారికే అప్పగించినట్టు తెలుస్తోంది. మరోవైపు ముంబయిలోని పలువురు అసంతృప్తులతో డీకే శివకుమార్ మాట్లాడినట్లు తెలుస్తోంది. వారికి మంత్రి పదవులు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ముంబయి హోటల్ లో మకాం వేసిన రెబల్ నేత నాగేంద్రను బెంగళూరు రావాలంటూ పిలిచారు.....ఆయన ద్వారా మిగతావారితోనూ రాయబారం నడుపుతారని తెలుస్తోంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలలో పలువురు సిద్ధరామయ్య సన్నిహితులున్నారు. అటు మంగళవారం సీఎల్పీ మీటింగ్ నిర్వహించనున్నారు. సమావేశానికి హాజరుకానివారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.

ఇంకోవైపు..రెబల్స్‌లో ఎక్కువమంది సిద్ధరామయ్య సన్నిహితులే ఉండటంతో జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవెగౌడ కాంగ్రెస్‌ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సిద్దూను ముఖ్యమంత్రిని చేస్తే రాజీనామా వెనక్కు తీసుకుంటామంటూ సందేశాలు రావడంపై ఆయన ఫైరయ్యారు. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఎలాంటి షరతులు లేకుండా మద్దతిస్తామని చెప్పిఇప్పుడు మాట మార్చడం సరికాదంటూ ఆయన అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. ఒక వేళ ముఖ్యమంత్రిని మార్చాల్సి వస్తే మల్లికార్జున ఖర్గేకు తాము మద్దతిస్తామని, సిద్ధరామయ్య సిఎం అవుతారంటే తాము అసెంబ్లీ త్యాగానికైనా సిద్ధమన్న హెచ్చరిక చేసినట్లు సమాచారం.

రాజీనామా చేసిన సభ్యుల్లో రామలింగారెడ్డి, సౌమ్యారెడ్డి, మునిరత్న, ఆనంద్‌సింగ్‌ మినహా మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు ముంబయిలోని ఒక హోటల్లో బస చేశారు.అయితే ఈ హోటల్లో నిన్న బీజేపీకి చెందిన ఇద్దరు నేతలు కనిపించడం చర్చనీయాంశమైంది. మరోవైపు నేతలు బస చేసిన హోటల్‌ వెలుపల కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగడంతో మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ భద్రతను రెట్టింపు చేసింది.

తాజా రాజకీయ పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తున్న బీజేపీ హైకమాండ్.. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులకోవద్దని డిసైడైంది. కుమారస్వామి సర్కార్ కుప్పకూలితే తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది బీజేపీ. ఇప్పటికే ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఫోకస్ చేసింది. బెంగళూరులోని ఓ హోటల్లో ఏకంగా ౩౦ రూమ్స్ ని బుక్ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story