ఆంధ్రప్రదేశ్

అనంతపురంలో నయా దొంగతనం

అనంతపురంలో నయా దొంగతనం
X

అనంతపురంలో నయా దొంగతనం బయటపడింది. కార్లను అద్దెకు తీసుకుంటామని నమ్మబలికి యజమానుల నుంచి వాహనాలు తీసుకుని వాటిని ఇతరులకు అమ్మి సొమ్ముచేసుకుంటున్న ముఠా సభ్యులను అనంత పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.

అనంతపురం జిల్లా తాడిమర్రికి చెందిన జయచంద్రారెడ్డి ధర్మవరం పట్టణంలో చిన్న చిన్న కాంట్రాక్ట్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అలాగే..కర్నూలు జిల్లాకు చెందిన దినేష్ ఓ ప్రయివేట్ బ్యాంకులో మేనేజర్ గా పనిచేస్తున్నాడు.. వీరిద్దరికి మంచి సంపాదన ఉన్నప్పటికి దుర్బిద్దితో ఎక్కువ సంపాదించాలన్న దురాశ వీరిని కటకటాల వెనక్కి నెట్టింది. ధర్మవరం పట్టణంలో ఉన్న పరిచయాలతో వీరిద్దరు ఒక్కటై నయా దోపిడికి తెరతీశారు. పట్టణంలో బాగా పరిచయాలు పెంచుకున్న వీరు.. కార్ల యజమానులను సంప్రదించి తమకు కారు అద్దెకు కావాలని తీసుకొని వాటిని యజమానికి తెలియకుండా ఇతరులకు విక్రయించి ఆసొమ్ముతో జల్సాలు చేశారు.

తమ వద్ద అద్దెకు తీసుకున్న వాహనాలకు బాడుగ డబ్బులు ఇవ్వకుండా.. తమ వాహనాలను తిరిగి ఇవ్వకుండా తమను సతాయిస్తున్నాడని ఓ కారు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ ప్రారంభించి తీగ లాగితే డొంకంతా కదిలింది. ఈ ఇద్దరు వ్యక్తులు కలసి మొత్తం 29 వాహనాలను అద్దెకు తీసుకొని ఇతరులకు అమ్మివేసారు. పోలీసులు సీక్రెట్ ఆపరేషన్లో ఈ విషయం బయటపడింది. యజమానుల వద్ద తీసుకొని ఇతరులకు అమ్మిన వాహలను పోలీసులు స్వాదీనం చేసుకొని యజమానులకు అప్పజెప్పారు.

ఈ కేసును విచారిస్తున్న సమయంలో పోలీసులకు ఇలాంటి మరో కేసు తారసపడింది.. రామగిరికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి కూడా ఇదే విధంగా తనకు తెలిసిన వారి వద్ద నుంచి దాదాపు 20 వాహనాలను అద్దెకు తీసుకొని ఇతరులకు అమ్మి వేశాడు. రెండో పట్టణ పోలీసులు అతి చాకచక్యంగా నిందితుణ్ని పట్టుకొని ఎవరెవరికి వాహనాలు అమ్మారో వారి వద్ద నుంచి స్వాదీనం చేసుకున్నారు. అద్దె పేరుతో వాహనాలు తీసుకునే వ్యక్తుల వివరాలు పూర్తిగా తెలుసున్న తరువాత వారిపై నమ్మకం ఏర్పడితేనే వారికి తమ వాహనాలను అద్దెకు ఇవ్వాలని పోలీసు అదికారులు కార్ల యజమానులకు సూచించారు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే సంబందిత సర్కిల్ పరిధిలో పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ తెలిపారు.

Next Story

RELATED STORIES