తెలంగాణ సెక్రటేరియట్ షిఫ్టింగ్ ప్రక్రియ.. మంత్రి ప్రశాంత్ రెడ్డి..

తెలంగాణలో ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్‌లోని ఆయా శాఖల షిఫ్టింగ్ ప్రక్రియ ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంది. ఒకటి సాంకేతికపరమైంది కాగా, మరొకటి భద్రతాపరమైనది. ఇందుకు సంబంధించి అటు ఐటీ శాఖ, ఇటు పోలీసు శాఖలు ప్రభుత్వానికి ఇప్పటికే నివేదికలు అందించినట్లు సమాచారం. ఈమేరకు శాఖల తరలింపులో ఈ రెండు శాఖలు ఇచ్చిన సలహాలు, సూచనలను అధికారులు పరిగణలోకి తీసుకోనున్నారు. అటు పరిపాలనా సౌలభ్యం కోసం సచివాలయం పరిసరాల్లోని భవనాల్లోకే శాఖలను తరలించాలని ముఖ్యమంత్రి కూడా అభిప్రాయపడ్డారు. ఫైళ్లు మిస్ అవడం, డాక్యుమెంట్లు చినిగిపోవడం లాంటివి జరగకుండా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
వీలైనంత తొందరగా శాఖల తరలింపు ప్రక్రియ పూర్తిచేసి, కొత్త సచివాలయం నిర్మాణం పనులను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. అటు వివిధ శాఖల నుంచి మంత్రి ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీకి అందిన గడువు ప్రతిపాదనలను కూడా ఆయన పరిశీలించారు. వివిధ విభాగాలు, తరలింపు కోసం తక్కువలో తక్కువ 2 రోజుల నుంచి గరిష్టంగా 2 నెలల వరకు గడువు కోరాయి. ఐతే శాఖల తరలింపునకు అంత సమయం అవసరం లేదని సీఎం అభిప్రాయపడ్డట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రక్రియను 15 రోజుల్లోపు పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆర్కైవ్స్ లో కొన్ని పురాతన పత్రాలు చాలా సున్నిత పరిస్థితుల్లో, ముట్టుకుంటే చిరిగిపోయే స్థితిలో ఉన్నాయి. వీటిని తరలించడానికి ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ముందు, ఆ పత్రాలను జిరాక్స్ తీయించడం, వాటిని స్కాన్ చేసిపెట్టడం లాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని అధికారులంటున్నారు.
ఇక ప్రభుత్వంలోని కీలక విభాగాలు, ఐటీ నెట్ వర్క్ పరస్పర ఆధారితాలు. అటు సచివాలయం, మంత్రుల భద్రత కూడా ఒకదానికొకటి ముడిపడి ఉన్నవే. అందుకే ఈ రెండు అంశాలు ప్రాధాన్యంగా సచివాలయ శాఖల తరలింపు జరగనుంది. సీఎం కేసీఆర్ కూడా శాఖలన్నీ ప్రస్తుత సచివాలయానికి దగ్గరగా ఉండేలా ప్రణాళిక రూపొందించాలని సాధారణ పరిపాలన శాఖకు సూచించారు. దీంతో శాఖల తరలింపు జరిగినా ముఖ్యమైన విభాగాలు అన్నీ పక్కపక్కనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తద్వారా ప్రభుత్వ కార్యకలాపాలకు, రోజువారీ పరిపాలనకు ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నారు.
మరోవైపు వైఫై, ఇంటర్నెట్, ఇంట్రానెట్, నెట్ వర్క్ అంశాలు కూడా శాఖల తరలింపులో కీలకం. ప్రస్తుతం జీఓఐఆర్, సీఎంఆర్ఎఫ్, మీసేవ, ఈ ప్రొక్యుర్ మెంట్, సమగ్ర వేదిక, ధరణి, ఐజీఆరెస్, మాభూమి, వెబ్ లాండ్, ఆరోగ్యశ్రీ, ఈ-ఆఫీస్, సివిల్ సప్లైస్, ఫైనాన్స్, ఎక్సైజ్, రెవెన్యూ, ట్రెజరీ, వ్యవసాయ, పోలీసు, ఆర్టీసీ, జెన్ కో, ఈఆర్పీ లాంటి అప్లికేషన్లతో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి పోర్టళ్లన్నీ గచ్చిబౌలిలో ఉన్న స్టేట్ డేటా సెంటర్లో ఉన్నాయి. అన్నీ కలిపి ప్రభుత్వం రోజువారీ వినియోగించే అప్లికేషన్లు 180 వరకు ఉంటాయని ఐటీ శాఖ సిబ్బంది అంటున్నారు. గచ్చిబౌలి స్టేట్ డేటా సెంటర్ నుంచి అప్లికేషన్లన్నిటినీ ఆప్టిక్ ఫైబర్ లైన్ల ద్వారా సెక్రటేరియట్ కు అనుసంధానం చేస్తున్నారు. ఇవికాక సీఎంఓ, డాష్ బోర్డ్, ఇతర శాఖలకు సంబంధించిన మరికొన్ని సెక్యూరిటీ ఆడిట్ క్లియరెన్స్ లేని చిన్నాచితకా అప్లికేషన్లు సచివాలయంలోని డీ-బ్లాక్ డేటా సెంటర్లో ఉన్నాయి. కెపాసిటీ తక్కువగా ఉన్న ఈ డేటా సెంటర్ ను బూర్గుల రామకృష్ణా రావు భవన్ మొదటి అంతస్తులో ఉన్న టీఎస్టీఎస్ లోకి తరలించనున్నారు. ఇక గచ్చిబౌలి నుంచి సచివాలయం వరకూ వేసిన ఆప్టిక్ ఫైబర్ లైన్లను బీఆర్కేఆర్ భవన్ వరకూ పొడగిస్తే.. ఇంటర్నెట్, ఇంట్రానెట్లో ఉన్న అప్లికేషన్లన్నిటినీ ప్రభుత్వ కీలక విభాగాలైన సీఎంఓ, సీఎస్ కార్యాలయం, జీఏడీలకు అందుబాటులోకి తేవచ్చు. అలా కాకుండా సీఎంఓ, సీఎస్, జీఏడీ, ఫైనాన్స్, లా లాంటి శాఖలను వేరేచోటికి తరలిస్తే, గచ్చిబౌలి నుంచి అక్కడికి కొత్తగా ఓఎఫ్సీ లైన్లు వేయాల్సి ఉంటుంది. అలా చేస్తే సమయం వృధా కావడంతో పాటు ఖర్చుతో కూడుకున్న పని అని ఐటీ నిపుణులంటున్నారు.
ప్రస్తుతం సెక్రటేరియట్ ఇంట్రానెట్ లో జీఓఐఆర్, సీఎంఆర్ఎఫ్, డాష్ బోర్డ్ లాంటి కీలక అప్లికేషన్లు పని చేస్తున్నాయి. వివిధశాఖలు, విభాగాల ప్రభుత్వ జీవోలు ఆన్ లైన్లో అప్ లోడ్ చేయాలన్నా, పై అధికారులు ఆ ఉత్తర్వులను చూసి సవరించాలన్నా, సీఎంఆర్ఎఫ్ లాంటి ముఖ్య అప్లికేషన్లను సంబంధిత అధికారులు యాక్సెస్ చేయాలన్నా ఇప్పటివరకు ఇంట్రానెట్ నెట్ వర్క్ లోనే చేస్తున్నారు. ఇది సాంకేతికంగా పూర్తిగా సురక్షితమైన వ్యవస్థ. కానీ శాఖల తరలింపుతో ఇకపై ఇంట్రానెట్ అందుబాటులో ఉండదు. దీంతో శాఖల అవసరాల కోసం కొన్ని అప్లికేషన్లను ఇకపై ఇంటర్నెట్లో అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది. ఇది కొంత ప్రమాదకరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ రహస్యాలు హ్యాకర్ల బారిన పడే ప్రమాదం ఉంటుందని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే రాష్ట్ర ఐటీ శాఖ.. ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని నిర్దిష్ట సూచనలు చేయనుంది. సెక్షన్ ఆఫీసర్లు, ఇతర ఉన్నతాధికారులు వాళ్ళ యూజర్ నేమ్, పాస్ వర్డ్ ల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించనుంది. ఉద్యోగుల యూనిక్ పాస్ వర్డ్ కచ్చితంగా 8 క్యారెక్టర్స్ తో ఉండాలని ఐటీ అధికారులు అంటున్నారు. పాస్ వర్డ్ క్యాపిటల్, స్మాల్ లెటర్స్, స్పెషల్ సింబల్స్, డిజిట్స్ సమ్మిళితంగా ఉండాలని నిబంధన పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పాస్ వర్డ్ లో డిక్షనరీ పదం ఉండకుండా జాగ్రత్తపడాలని చెబుతున్నారు.
మంత్రుల కార్యాలయాలన్నీ ఇప్పటిదాకా సచివాలయంలో ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. సెక్రటేరియట్ మొత్తం ఎస్పీఎఫ్ సిబ్బంది కనుసన్నల్లో ఉంటుంది. అయితే శాఖల తరలింపుతో మంత్రిత్వ శాఖలు, కార్యాలయాలు వివిధ చోట్లకు వెళతాయి. ఈ పరిస్థితుల్లో వీవీఐపీ భద్రత చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించి పోలీస్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ కూడా ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చిందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలోని కీలక కట్టడాలు, డ్యాంలు, ఇతర ముఖ్య భవనాల భద్రత, వాటిల్లో వీవీఐపీల రక్షణ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న ఎస్పీఎఫ్ లాంటి ఏజెన్సీలకు సచివాలయంతో పాటు ఇతర చోట్ల కూడా సిబ్బంది ఉన్నారు. ఒక్క సెక్రటేరియట్ లోనే దాదాపు 200 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది పని చేస్తున్నారు. వీళ్లంతా ఒక సీఎస్ఓ, 4 గురు ఇన్స్ పెక్టర్లు, 8 మంది ఎస్సైల పర్యవేక్షణలో సంవత్సరం పొడవునా, 24 గంటలు పహారా కాస్తున్నారు. ఇప్పుడు సచివాలయం నుంచి శాఖలు తరలివెళ్తే సీఎస్ఓతో పాటు మరికొంత మంది ఎస్పీఎఫ్ సిబ్బంది బీఆర్కేఆర్ భవన్ కు వెళ్తారు. మిగిలిన వాళ్ళను టీంలుగా విభజించి వివిధ శాఖలు తరలే చోట్లకు పంపనున్నారు. ఒక్కో భవనానికి ఒక్కో ఎస్సైని ఇంచార్జ్ గా నియమించే అవకాశాలు ఉన్నాయి.
అటు ఐటీ నెట్ వర్క్ పరంగా, ఇటు సెక్యూరిటీ రీత్యా కూడా బీఆర్కే భవన్, గగన్ విహార్, చంద్రవిహార్ లాంటి పరిసర ప్రాంతాల భవనాలకు సచివాలయ శాఖలను తరలిస్తే పెద్దగా ఇబ్బంది తలెత్తకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్పీఎఫ్ కు సైతం సిబ్బంది సర్దుబాటు కొంత సులువవుతుందని అధికారులంటున్నారు. అందుకే సీఎంఓ, సీఎస్, జీఏడీ లాంటి ప్రధాన విభాగాలను పక్కనే ఉన్న బీఆర్కేఅర్ భవన్ కు, మిగిలిన శాఖలను దాని సమీపంలోని భవనాల్లోకి తరలించేలా సాధారణ పరిపాలన శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

