గోదావరికి భారీగా వరదనీరు..
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద ఉగ్ర రూపం దాల్చుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో పోలవరం ప్రాజెక్టులో కీలకమైన నిర్మాణమైన కాపర్ డ్యామ్‌పై నుంచి వరద పొంగి పొర్లుతోంది. స్పిల్ వే వైపు నుంచి గోదావరిలో కాపర్ డ్యామ్ వరకు యంత్ర సామాగ్రిని తరలించడానికి నిర్మించిన 2 వందల మీటర్ల మట్టిరోడ్డు కొట్టుకుపోయింది.
వరద ధాటికి రోడ్డు కొట్టుకుపోవడంతో కాపర్ డ్యామ్ వరకు వెళ్లడానికి దారిలేకుండా పోయింది. 3 రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టు అథారిటీ కమిటీ కాపర్ డ్యామ్ నిర్మాణపనులను పరిశీలించింది. వరదలు వస్తే క్యాపర్ డ్యాంకు ఇబ్బంది కలగకుండా 3 మీటర్ల ఎత్తు పెంచాలని జలవనరుల శాఖ అధికారులను కమిటీ ఆదేశించింది. కానీ అకస్మాత్తుగా వరద రావడంతో నది మధ్యభాగంలో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ప్రవాహం మరో 2 రోజులు కొనసాగవచ్చని కేంద్ర జల సంఘం అంచనా వేస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com