భారత్-కివీస్ మధ్య తొలి పోరు.. వర్షం పడితే లాభం ఎవరికో తెలుసా?

వరల్డ్ క్రికెట్ టోర్ని చివరి దశకు చేరుకుంది. మరో మూడు మ్యాచ్‌లతో విజేత ఎవరో తేలిపోతుంది. ప్రపంచకప్‌లో తొలి సెమీస్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం వేదికగా ఇవాళ జరగనుంది. పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్, నాలుగో స్థానంలోని న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ వరల్డ్ కప్‌లో భారత్-కివీస్ మధ్య తొలి పోరు ఇదే. ఈ మొదటి నాకౌట్ పోరు కోసం కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు జట్లలో ఏది ముందుగా ఫైనల్ చేరుతుందో అని ఉత్కంఠతో ఉన్నారు. ఇప్పటికే 8 మ్యాచుల్లో ఏడు గెలిచి 15 పాయింట్లతో అగ్రస్థానంలో టీమిండియా ఉంది..
అయితే భారత్-కివీస్ సెమీఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుకునే అవకాశం లేకపోలేదని బ్రిటిష్ వాతావరణ శాఖ తెలిపింది. గత నెల 13న నాటింగ్‌హామ్‌లో కివీస్‌తో జరగాల్సిన లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దాంతో రెండు జట్లకు చెరో పాయింటు పంచారు . ఇప్పుడు మళ్లీ వీరి మ్యాచ్‌కే వరుణుడు అంతరాయం కలిగించే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం మాంచెస్టర్ మేఘావృతమైంది. మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.. ఈ నేపథ్యంలో సెమీస్ సవ్యంగా సాగుతుందా లేదా అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
లీగ్ మ్యాచ్‌లకు రిజర్వు డే లేదు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే చెరో పాయింట్ ఇచ్చారు. కానీ సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు ఐసీసీ రిజర్వు డేలను కేటాయించింది. మొదటి రోజు మ్యాచ్ వర్షార్పణం అయితే రిజర్వు డే రోజు ఆడిస్తారు. ఇక రిజర్వు డే రోజు కూడా వర్షం పడితే.. ఐసీసీ నిబంధనల ప్రకారం లీగ్ పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న జట్టు ఫైనల్‌కు చేరుతుంది. కివీస్‌తో సెమీఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. భారత్ ఫైనల్‌కు చేరుతుంది.
అటు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరడంతో వీటిలో ఏయే జట్లు తుది పోరుకు అర్హత సాధిస్తాయి అన్న దానిపై క్రీడాభిమానుల్లో ప్రధానంగా చర్చజరుగుతోంది. అటు టాప్ స్కోరర్‌గా వరల్డ్ కప్‌లో ఎవరు నిలుస్తారనే దానిపై కూడా దాదాపు అదే స్థాయిలో చర్చ నడుస్తోంది. లీగ్ దశ ముగిసే సరికి భారత ఓపెనర్ రోహిత్ శర్మ 647 పరుగులతో టాప్ లేపితే, ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 638 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరూ ఆడే జట్లూ సెమీస్ బరిలో ఉండటంతో ఎవరు టాప్ స్కోరర్‌గా నిలుస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com