కర్ణాటకలో ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకోవడానికి మాస్టర్ ప్లాన్
కర్ణాటకలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సంక్షోభంలో నుంచి ప్రభుత్వాన్ని కాపాడేందుకు కూటమి నేతలు శతవిధలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆపరేషన్ కమల్‌కు చెక్ పెట్టి, అసంతృప్త ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేశారు. అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు.. ప్రభుత్వం కూలిపోకుండా ఉండేందుకు కూటమి మంత్రులు త్యాగాలకు సిద్ధపడ్డారు. తిరుగుబాటు నేతలను కేబినెట్‌లో చోటు కల్పించేందుకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వరతో పాటు కాంగ్రెస్‌కు చెందిన 21 మంది మంత్రులు, జేడీఎస్‌కు చెందిన మినిస్టర్లు రిజైన్ చేశారు. వారిపై ఎవరి ఒత్తిడి లేదని, వారంతా స్వచ్ఛందంగానే మంత్రి పదవులకు రాజీనామా చేసినట్లు కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేత సిద్ధరామయ్య స్పష్టం చేశారు. సంక్షోభం త్వరలోనే సమసిపోతుందని మాజీ సీఎం సిద్ధరామయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. అటు త్వరలోనే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని కుమారస్వామి ట్వీట్ చేశారు.
తలనొప్పిగా మారిన కర్ణాటక సంక్షోభంపై కాంగ్రెస్ ఆగ్రనాయకత్వం.. ఆపార్టీ కీలక నేతలు ఢిల్లీలో అత్యవసరంగా సమావేశమై ఎమ్మెల్యేల రాజీనామా, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. అటు కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, సిద్దరామయ్య, జి.పరమేశ్వర తదితరులు బెంగళూరులో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరిపారు. ఈ చర్చోపచర్చలు సాగుతుండగానే రాజీనామా వ్యవహారం ముదిరింది. మంత్రి H.నగేష్ తన పదవికి రిజైన్ చేశారు. రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు సమర్పించారు. దీంతో రిజైన్ చేసినవారి సంఖ్య 14కు పెరిగింది. నగేష్, ఇటీవలే కుమార స్వామి కేబినెట్లో చేరారు. ఐతే, తనను సరిగా పని చేసుకోనివ్వడం లేదని, అందువల్లే మంత్రి పదవికి రిజైన్ చేశానని చెప్పారు. బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్ కూడా ప్రభుత్వానికి ఝలకిచ్చారు. నగేష్, మహేష్‌లు బీజేపీకి మద్దతు ప్రకటించారు. మరో MLA అంజలి నింబల్కర్ కూడా రాజీనామా బాటలో ఉన్నట్లు సమాచారం.
అటు ముంబై హోటల్లో క్యాంపు నిర్వహిస్తోన్న ఎమ్మెల్యేలతో చర్చలు జరిపేందుకు రంగంలోకి దిగారు ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్. ఐతే, డీకే రాకను పసిగట్టిన రెబల్ ఎమ్మెల్యేలు వ్యూహం మార్చారు. వారంతా ముంబై నుంచి గోవాకు మకాం మార్చారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి త్యాగాలకైనా సిద్దమని సీనియర్ నేత డీకే శివకుమార్ పేర్కొన్నారు. అటు, జేడీఎస్ ఎమ్మెల్యేలను కూర్గ్‌లోని ఓ రిసార్టుకు తరలించారు. కొడగు-సోమ్‌వార్‌పేటలోని పడింగ్టన్ రిసార్టు లో ఎమ్మెల్యేల కోసం 35 గదులు బుక్ చేసినట్లు తెలుస్తోంది.
అటు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు ముఖ్యమంత్రి కుమారస్వామి.. త్వరలోనే సమస్య సద్దుమణుగుతుందని చెప్పారు. ప్రభుత్వం సజావుగా సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు సీఎం..
మరోవైపు కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ సర్కారు పరిస్థితిని బీజేపీ నిశీతంగా గమనిస్తోంది. తాజా పరిణామాలపై కర్ణాటక బీజేపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించిన మాజీ సీఎం, కర్ణాటక బీజేపీ చీప్ యడ్యూరప్ప.. రానున్న రోజుల్లో మరికొంత మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడే అవకాశం ఉందని అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాకు .. ఆ పార్టీ అధినేతల వైఖరి కారణమని విమర్శించారు. ఎమ్మెల్యేల రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే .. తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టంచేశారు.
కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం లోక్‌సభను కుదిపేసింది. ఈ అంశంపై లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడింది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో 303 ఎంపీ సీట్లు గెలిచినా బీజేపీ కడుపు నిండడం లేదని.. అందుకే కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ పార్లమెంటరీ నేత అధీర్ రంజన్ చౌదరి.
కాంగ్రెస్ విమర్శలకు దీటుగా బీజేపీ బదులిచ్చింది. కన్నడ రాజకీయ సంక్షోభంతో తమకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అసంతృప్త ఎమ్మెల్యేలతో బీజేపీ టచ్‌లో లేదని తేల్చి చెప్పింది. రాజీనామాల ఎపిసోడ్‌కు రాహుల్ గాంధీనే కారణమని, రిజైన్ చేయాలంటూ రాహుల్ అందరినీ అడుగుతున్నారని ఎదురు దాడి చేసింది. మరో వైపు బీజేపీ తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగారు కాంగ్రెస్- జేడీఎస్ శ్రేణులు. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటున్నారంటూ మండిపడుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com