తెలుసా.. ఆధార్, పాన్ నిబంధనలు మారాయని!!

తెలుసా.. ఆధార్, పాన్ నిబంధనలు మారాయని!!

ఆధార్ కార్డులేకుండా అడుగు ముందుకు పడట్లేదు. ఏపని జరగాలన్నా ఆధార కార్డు కంపల్సరి. ఇక పాన్ కార్డు కూడా బడా బాబుల జేబుల్లోనే ఉంటుందనుకుంటే పొరపాటే. మినిమమ్ ఇన్‌కం ఉన్న ప్రతి ఒక్కరికీ పాన్ కార్డుని తప్పనిసరి చేసింది ప్రభుత్వం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో పాన్, ఆధార్‌కు సంబంధించి పలు మార్పులు చోటు చేసుకున్నాయి. తొలి బడ్జెట్‌లో ఆధార్ కార్డు, పాన్ కార్డు, క్యాష్ విత్‌డ్రా, క్యాష్ డిపాజిట్, ఐటీఆర్ ఫైలింగ్ వంటి వివిధ అంశాలకు సంబంధించి పలు మార్పులను ప్రతిపాదించారు. నల్లధనం నియంత్రణ, క్యాష్‌లెస్ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా ఈ మార్పులకు శ్రీకారం చుట్టారు.

మారిన నిబంధనలు..

రూ.50,000లకు పైన లావాదేవీలకు ఆధార్ కార్డు ఉపయోగిస్తే సరిపోతుంది. ఇప్పటివరకు అయితే 50వేల పైన ట్రాన్సాక్షన్లు చేయాలంటే పాన్ కార్డ్ కచ్చితంగా అవసరం ఉండేది. ఇకపై బంగారం కొనుగోలు చేయాలన్నా, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలన్నా పాన్ బదులు ఆధార్ సమర్పిస్తే సరిపోతుంది. బ్యాంకుల్లో నగదు 50వేలకు పైగా డిపాజిట్ చేయాలన్నా, అధిక మొత్తంలో క్యాష్ విత్ డ్రా చేయాలనుకున్నా కూడా ఆధార్ సమర్పిస్తే సరిపోతుంది. పాన్ కార్డుతో పనిలేదు. రెండింటిలో ఏది ఉన్నా ఒక్కోసారి పనైపోతుంది. ఆధార్ కార్డు సాయంతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారికి ఇకపై ఐటీ అధికారులే కొత్త పాన్ కార్డును జారీ చేస్తారు. పాన్ కార్డు లేని వారు కూడా ఇకపై ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. ఆధార్‌తో పాన్ కార్డు లింక్ చేయకపోయినా పాన్ కార్డు డీ యాక్టివ్ కాదని ఆర్థిక శాఖ కార్యదర్శి తెలియజేస్తున్నారు.

Tags

Next Story