తెలంగాణలో నయాగర జలపాతం.. సవ్వడులు షురూ..

తెలంగాణలో నయాగర జలపాతం.. సవ్వడులు షురూ..

తెలంగాణ నయాగర బొగత జలపాతం సవ్వడులు షురూ అయ్యాయి. చత్తీస్‌గడ్‌- తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని దట్టమైన అడవి.. కొండ కోనల నడుమ ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు జలపాతం ఉరకలెత్తుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి ఫాల్స్ పర్యాటకులతో కళకళలాడుతుంది. ప్రకృతి సౌందర్యానికి పరవశించిపోతున్నారు.

పచ్చని దట్టమైన అడవుల మధ్య కొండకోనల్లో నుంచి హోరెత్తే నీటి హొయల నిండైన జలపాతం బొగత. ప్రకృతి సృష్టించిన అద్భుతమైన అందాల్లో ఇది ఒకటి.. బొగత వాటర్‌ఫాల్స్ చీకులపల్లి ఫాల్స్ అనికూడా అంటారు. కాళేశ్వరం-భద్రాచలం అడవుల మధ్యన ఇది ఉంది. చుట్టూ కొండల నడుమ 30 అడుగుల ఎత్తు నుంచి వాగు నీళ్లు దుంకి కింద పెద్ద జలాశయంగా ఏర్పడుతాయి. రమణీయంగా మారిన బొగత జలపాతం పర్యాటకులను తెగ ఆకర్షిస్తోంది..

తెలంగాణ నయాగరాగా చెప్పుకునే ఈ జలపాతాన్ని తిలకించడానికి తెలంగాణ నుంచే కాకుండా.. మహారాష్ట్ర , చత్తీస్‌గడ్ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. జలపాతంలో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పుసూరు గోదావరి వంతెన సమీపంలో హరిత హోటల్స్, గోదావరిలో బోట్ షికార్, జలపాతం వద్ద కాటేజీల ఏర్పాటుతో పర్యాటకులను మరింత అకట్టుకుంటోంది బొగత జలపాతం..

అటు ఈ జలపాతం ప్రాంతానికి తరలి వస్తున్న పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. నీటి ఉధృతికి ఎవరు నీటిలో కొట్టుకు పోకుండా చుట్టూ ఇనుప చువ్వలతో కంచెను నిర్మించారు.

Tags

Next Story