పోలవరం కాపర్ డ్యామ్‌ వద్ద కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డు

పోలవరం కాపర్ డ్యామ్‌ వద్ద కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డు

పోలవరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో కాఫర్ డ్యామ్‌ వద్ద తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. ఎగువన మహారాష్ట్రలోని కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి పొంగిపొర్లుతోంది. ఈ నేపథ్యంలో కాపర్‌ డ్యామ్‌ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సాయంత్రానికి లక్ష క్యూసెక్కుల నీరు చేరుకునే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో 10 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంటుందని అంచనావేస్తున్నారు అధికారులు. అదే జరిగితే ముంపు మండలాలకు పెను ప్రమాదం పొంచి ఉంది.

వరద ఉధృతి పెరిగితే 4 వేలకు పైగా ఇళ్లు నీటమునిగే ప్రమాదం ఉంది. గత ఏడాది గోదావరికి 14 లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వచ్చింది. గతంలో భారీ వర్షాలు వరదలకు గోదావరిలో 36 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సాధారణ ఇన్‌ఫ్లో ఉన్నప్పటికీ భారీ నష్టం సంభవించే ప్రమాదం ఉంది. వరద ప్రవాహం పెరిగితే పోలవరం స్పిల్‌వే నుంచి నీటిని విడుదల చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే అప్పుడు స్పిల్‌ వేకు కూడా ముప్పు ఉండే అవకాశం లేకపోలేదు.

వరద ధాటికి రోడ్డు కొట్టుకుపోవడంతో కాఫర్‌ డ్యామ్‌ వరకు వెళ్లడానికి దారిలేకుండా పోయింది. 3 రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టు అథారిటీ కమిటీ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణపనులను పరిశీలించింది. వరదలు వస్తే డ్యామ్‌కు ఇబ్బంది కలగకుండా 3 మీటర్ల ఎత్తు పెంచాలని జలవనరుల శాఖ అధికారులను కమిటీ ఆదేశించింది. కానీ అకస్మాత్తుగా వరద రావడంతో నది మధ్యభాగంలో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ప్రవాహం మరో 2 రోజులు కొనసాగవచ్చని కేంద్ర జల సంఘం అంచనా వేస్తోంది.

Tags

Next Story