తిరుపతి గరుడ వారధి ప్రాజెక్టు పనులకు బ్రేక్..

తిరుపతి గరుడ వారధి ప్రాజెక్టు పనులకు బ్రేక్..

తిరుపతి నగర చరిత్రలోనే భారీ ప్రాజెక్టుగా పేరొందిన గరుడ వారధి ప్రాజెక్టు పనులకు బ్రేక్ పడింది..700 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులను నిలిపివేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది..గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించి 25 శాతానికి మించని ప్రాజెక్టులను ఆపేయాలన్న నిర్ణయం మేరకు ఈ వారధి పనులు నిలిచిపోయాయి..ఇటీవల ఊపందుకున్న పనులు.. అంతలోనే ఆగిపోవడం సర్వత్ర చర్చనీయాంశమైంది..

తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రం కావడంతో వాహనాల రాకపోకలతో నిత్యం బిజీగా ఉంటుంది. ఈ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు గత ప్రభుత్వం తిరుచానూరు నుండి కపిలతీర్థం వరకు గరుడ వారధి ప్రాజెక్ట్ చేపట్టాలని నిర్ణయించింది. ఈ పనులను ఆప్కాన్ సంస్థకు అప్పజెప్పింది. 2 సంవత్సరాల వ్యవధిలో పనులు పూర్తిచేసేలా ఒప్పందం కుదిరింది. 2019మార్చ్ 5న పనులు మొదలయ్యాయి...కోట్లాది రూపాయల విలువైన యంత్రాలను తిరుపతికి తరలించారు. ఇప్పటికే 135 కోట్ల విలువ పనులను నిర్మాణసంస్థ పూర్తిచేసింది..

గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో 25 శాతం పూర్తికాని ప్రాజెక్టులను తాత్కాలికంగా నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విధాన పరమైన నిర్ణయం తీసుకుంది. ఇదే నిబంధన ప్రకారం తాజాగా కార్పొరేషన్ అధికారులు కాంట్రాక్టు సంస్థకు నోటీసులు జారీ చేశారు. గరుడ వారధి ఆగిపోతే ఇటు నగర వాసులు, అటు యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ప్రాజెక్టు ఆగిపోదని కాస్త ఆలస్యం మాత్రమే అవుతుందని తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెబుతున్నారు.

Tags

Next Story