కాఫర్ డ్యామ్ మహా విపత్తుకు కారణమవుతుందా?.. ఆందోళనలో 31 గ్రామాలు

కాఫర్ డ్యామ్ మహా విపత్తుకు కారణమవుతుందా?.. ఆందోళనలో 31 గ్రామాలు
X

వరద వచ్చేసింది.... ప్రవాహమై ఉరకలేస్తుంది.. గోదారమ్మ ఉధ్రుత రూపం దాలుస్తోంది. ఆ ప్రవాహానికి అడ్డుకట్ట తగిలితే ... ఒక్కసారిగా ముందుగా సాగాల్సిన ప్రవాహం వెనక్కి విరుచుకుపడితే ... ఇదే 31 గ్రామాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అడ్డుకట్టగా ఉన్న కాఫర్ డ్యామ్ వల్ల తలెత్తబోయే విపత్తు ఏవిధంగా ఉండబోతోంది అనేది అందరికీ వణుకుపుట్టిస్తోంది. ప్రస్తుతానికి వస్తున్న వరదనీరు ప్రమాదకరం కాకపోయినా.. రానున్న వరద నీరు ఏ స్థాయిలో ఉండబోతోంది. వరద వేగంగా పోటెత్తితే ముంపు గ్రామాల ప్రజల భద్రతకు ప్రభుత్వ వద్ద ప్రణాళికేంటి..? తలెత్తుతున్న ఎన్నో ప్రశ్నలకు ముంపు గ్రామాల ప్రజలేమంటున్నారు...? టీవీ5 స్పెషల్ రిపోర్ట్.

వరద సమయంలో గోదారమ్మ ఉగ్రరూపంలో ఉంటుంది. ఎగువన వర్షాలు అధికంగా పడితే గోదారమ్మ వేగాన్ని ఆపడం ఎవ్వరి తరమూ కాదు. లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలు కావాల్సిందే. ప్రతీ ఏడాది గోదారి వరదై పోటెత్తడం మామూలే. గోదావరీ పరీవాహక ప్రాంత ప్రజలకు వరద ముంపు అలవాటే. ఇప్పుడు వర్షాలు ఆలస్యంగా పడినా ...ఎగువన పడ్డ వర్షాలు తక్కువే అయినా ....ఎప్పుడూ వచ్చే వరదలా కాకపోయినా.. కొద్దిపాటి నదీ ప్రవాహానికే గోదారమ్మను చూస్తే ముంపు ప్రాంతాల ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. 36 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహంలోనూ నదీమతల్లి ఒడిలో రోజుల పాటు గడిపిన వారే ఇప్పుడు పారుతున్న లక్ష క్యూసెక్కుల నీటి ప్రవాహానికి వణికిపోతున్నారు. అదేంటి అంటే ఒక్కటే కారణం.. ప్రవాహానికి అడ్డుగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం, తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలాల మధ్య కడుతున్న కాఫర్ డ్యాం నదీప్రవాహానికి అడ్డుకట్టగా తయారైంది. వేగంగా వచ్చిన నదీప్రవాహం ముందుకు వెళ్లేది కొంచెమే కావడం.. వెనక్కి ఆగిపోయిన నీరు ఎక్కువవడం ముంపుగ్రామాల వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎగువ నుంచి ఒక్కసారిగా వరద పోటెత్తితే దిగువకు పోయే నీరు తక్కువయితే బ్యాక్ వాటర్‌గా మిగిలిపోయిన గోదావరి జలాలు ఒక్కసారిగా 31 గ్రామాలను ముంచెత్తుతాయి. ఊళ్లకు ఊళ్లు నదిలో కలిసిపోయే ప్రమాదం ఉంది.

రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు కోసం రెండు కాఫర్ డ్యాంలు నిర్మిస్తున్నారు. ఎగువ కాఫర్ డ్యాంలో మూడు రీచ్ లలో 14 వందల మీటర్ల పొడవున్న రెండో రీచ్ 35 మీటర్ల ఎత్తులో నిర్మితమైంది. మొదటి రీచ్ 18 మీటర్ల ఎత్తులో నిర్మితం కాగా.. మూడో రీచ్ వరద నీటిని ద్రుష్టిలో పెట్టుకుని నిర్మాణం చేపట్టలేదు. ఎక్కువ ఎత్తులో నిర్మించిన రెండో రీచ్ కారణంగానే ప్రమాదం పొంచి ఉందన్నది నిపుణుల అంచనా. ఎగువన వర్షాలు ఒకవైపు... శబరీ నది నుంచి ఎక్కువ మొత్తంలో నీరు గోదావరిలో కలవడంతో... వరద ప్రవాహం వేగం పుంజుకుంటోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 30 వేల క్యూసెక్కుల నుంచి 65 వేల క్యూసెక్కులకు ఒక్కరోజులో ఇన్ ఫ్లో మారిపోతే... ఆ తరువాత 12 గంటల్లో లక్షా 38 వేల క్యూసెక్కులకు నీటి ప్రవాహ వేగం పెరిగింది. ధవళేశ్వరంలో అంత ఉంటే పోలవరం కాఫర్ డ్యాం వద్ద పరిస్థితేంటి. అడ్డుకట్టగా ఉన్న కాఫర్ డ్యాం వలన దిగువకు వెళ్లే నీరు తక్కువవడం ఎగువన ఉన్న ముంపు గ్రామాల ప్రజలను బెంబేలెత్తిస్తోంది.

లక్షా 38 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వేగంతో దిగువకు పారుతుంటే ముంపుకు సంబంధించిన ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. మరికొన్ని గంటల్లో రెండు లక్షల క్యూసెక్కుల ప్రవాహవేగం ఉండొచ్చనేది అంచనా. దీంతో దేవీపట్నం మండల ముంపుగ్రామాల ప్రజలు ఆందోళనలో గడుపుతున్నారు. గడిచిన ఏడాది ధవళేశ్వర బ్యారేజీ వద్ద 14లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది. 2.4 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నదిలో 17వందల మీటర్ల విస్తీర్ణంలో కాఫర్ డ్యాం నిర్మాణం జరగడం వలన 5లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నా ప్రమాదమే అంటున్నారు ఇరిగేషన్ అధికారులు. ఇప్పటికే రెండులక్షలకు రీచ్ అవుతున్న పరిస్థితుల్లో ఎగువన వర్షాలు అధికంగా పడితే శబరి నుంచి వచ్చే నీటివేగం అధికమైతే పరిస్థితి ఏంటన్నది ఆందోళనగా ఉంది. కాఫర్ డ్యాం సమీపంలో రహదారులు కొట్టుకుపోయాయి. 35 మీటర్ల ఎత్తులో కాఫర్ డ్యాం నిర్మాణం జరగ్గా.. నదీమట్టానికి 25 మీటర్ల ఎత్తులో ఉన్న దేవీపట్నం ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. వరద నీరు ఒక్కసారిగా వెనక్కి విరుచుకుపడితే పరిస్తితేంటని భయపడుతున్నారు. దేవీపట్నంలో ఇప్పటికే సగం మంది ఖాలీ చేయగా మిగిలిన చాలా గ్రామాల్లో ఎవ్వరూ ఊరిని వదిలి వెళ్లలేదు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో తరలించే ప్రయత్నం చేయకపోవడంతో అలాగే బతుకుతున్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న నేపధ్యంలో ముంపుగ్రామాల్లోని ప్రజలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి పునరావాసం ముందు కల్పించాల్సి ఉండగా అది జరగలేదు. కాఫర్ డ్యామ్ కారణంగా ముంపు ప్రభావిత కుటుంబాలు 18 వేలకు పైగా ఉండగా.. 4 వేల మందికి మాత్రమే పునరావాసం కల్పించిన పరిస్థితి. మిగిలిన వారిని తరలించడంలో పూర్తి స్థాయి ప్రయత్నం జరగలేదు. కాగా వరద పోటెత్తుతున్న పరిస్థితిలో అధికారులు ముంపు ప్రభావిత గ్రామాల్లో పర్యటిస్తున్నారు తప్ప.. వారికి ఎలాంటి భరోసా కల్పించడంలేదని ముంపు గ్రామాల వాసులంటున్నారు. ఎప్పుడూ వచ్చే ముంపు లాగే రెవెన్యూ అధికారులు ప్రణాళిక వేసుకుంటున్నారు తప్ప.. వారి వద్ద పటిష్టమైన ప్రణాళిక లేకపోవడం ముంపు గ్రామాల వాసుల ఆందోళనకు గురిచేస్తోంది.

తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకమైన కన్నేపల్లి పంప్‌హౌజ్‌ను సిఎం కేసీఆర్‌ వ్యక్తిగత కార్యదర్శి స్మితాసబర్వాల్‌ పరిశీలించారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో కన్నేపల్లికి చేరుకున్న స్మితాసబర్వాల్‌కు ఇంజనీరింగ్‌ అదికారులు ఘన స్వాగతం పలికారు. మోటారు పంపులను పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. సుమారు రెండు గంటల పాటు స్మితాసబర్వాల్‌ అదికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు రెండు మోటార్లను వెట్‌ రన్‌ నిర్వహించారు. ఈరోజు మూడవ మోటారును స్మితసబర్వాల్‌ ప్రారంభించారు. ఈ 3 మోటార్ల ద్వారా 3 టీఎంసీల నీరు అన్నారం బ్యారేజ్‌కు చేరుతుందని అధికారులు తెలిపారు. సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు,ప్రాజెక్ట్‌ సీఈ వెంకటేశ్వర్లు కూడ పాల్గొన్నారు.

Tags

Next Story