నాది ఆయన లాంటి వ్యక్తిత్వం కాదు:బాల్క సుమన్

టీఆర్‌ఎస్‌కు ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ గుడ్ బై చెప్పారు. ఐతే.. వెళ్తూ వెళ్తూ ఆయన చేసిన ఆరోపణలు టీఆర్‌ఎస్‌లో కలకలం రేపుతున్నాయి. పార్టీలో అరాచకం పెరిగిపోయిందని.. కేసీఆర్ డిక్టేటర్‌గా మారిపోయారంటూ సోమారపు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఐతే.. త్వరలోనే సోమారపు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ.. వెళ్తూ వెళ్తూ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. రామగుండంలో తన ఓటమికి బాల్క సుమన్, మరికొందరు నేతలు కారణమని సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ సభ్యత్వం పుస్తకాలు ఇవ్వకుండా తనను వేధించారన్నారు. పార్టీలో గౌరవం లేనప్పుడు పనిచేయడం కష్టమన్నారు. కేసీఆర్ ను తాను అడగకుండానే ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. అయినా..కొందరి తీరు వల్లే టీఆర్‌ఎస్‌లో ఇమడలేకపోతున్నానన్నారు.
2018 ఎన్నికల్లో సోమారపు సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థి కోరుకంటి చందర్ చేతిలో ఓడిపోయారు. అయితే..కోరుకంటిని పార్టీలోకి తీసుకోవటంతో సోమారపు సత్యనారాయణ అసంతృప్తితో ఉన్నారు. ఆయన పార్టీ మారుతున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు టీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతున్నట్లు ఆయన ప్రకటించారు.
పార్టీ వీడే సమయంలో సోమారపు సత్యనారాయణ చేసిన విమర్శలపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ నేతలను ఓడించాలనే వ్యక్తిత్వం తనది కాదన్నారు బాల్క సుమన్. సోమారపు రాజకీయాలు ఏంటో రామగుండం ప్రజలకు తెలుసన్నారు.పార్టీలో పదవులు అనుభవించి ఓడిపోయిన తర్వాత విమర్శలు చేయటం సరికాదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తన కొడుకు రాజకీయ ఫ్లాట్ ఫాం కోసమే టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. వెళ్తూ వెళ్తూ టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేసిన సోమారపు సత్యనారాయణ.. త్వరలోనే బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com