ఆశల్లేని మ్యాచ్‌లో గొప్ప పోరాటం చేసిన టీమిండియా

మాంచెస్టర్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో వరుణుడు భారత్‌తో ఆడుకున్నాడు. సెమీఫైనల్‌ మ్యాచ్‌లో 5 పరుగులకే టాప్‌ ఆర్డర్‌ను కోల్పోయిన భారత్‌ను.. రిషబ్‌ పంత్‌, దినేష్‌ కార్తీక్‌ కాసేపు ఆదుకున్నారు. ఆ తర్వాత కార్తీక్‌ కూడా అవుట్‌ కావడంతో భారత్ పీకల్లోకు కష్టాల్లో కూరుకుపోయింది. అయినా ఆశల్లేని మ్యాచ్‌లో టీమిండియా గొప్ప పోరాటం చేసింది.

వర్షం కారణంగా మాంచెస్టర్‌ పిచ్‌ ఆది నుంచే బౌలర్లకు సహకరించింది. ముఖ్యంగా సీమ్‌ బౌలర్లు ట్రెంట్‌ బౌల్ట్‌, హెన్రీ, ఫెర్గూసన్‌ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందులకు గురిచేశారు. షార్ప్‌ స్వింగ్‌ ను ఆడడంలో ఉన్న బలహీనతను మరోసారి మన బ్యాట్స్‌మెన్‌ బయటపెట్టుకున్నారు. మిగతా పిచ్‌లపై ఆడినట్లు షాట్లు ఆడేందుకు ప్రయత్నించడంతో... వికెట్లు టపటపా పడిపోయాయి. ధోనీ, జడేజా భారత్‌ను దాదాపు గెలిపించే ప్రయత్నం చేశారు. కానీ కీలక సమయంలో ఔట్‌ కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. దీంతో 18 పరుగుల తేడాతో గెలిచిన న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరుకుంది. భారత్‌ 49.3 ఓవర్లలో 221 పరుగులకే పరిమితమైంది. ఈ ఓటమితో భారత్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Tags

Read MoreRead Less
Next Story