సోనియాతో సౌమ్యారెడ్డి భేటీ.. వేగంగా మారుతున్న పరిణామాలు
కర్ణాటకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అసంతృప్తులను కాంగ్రెస్-జేడీఎస్ నేతలు బుజ్జగిస్తూనే ఉన్నారు. సీఎల్పీ సమావేశానికి 21 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. అటు ఈనెల 21న క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని మాజీ సీఎం సిద్ధారామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఆపరేషన్ కమల్‌కు చెక్ పడుతుందని పేర్కొన్నారు.
కర్ణాటకలో రాజకీయ పరిణామాలు క్షణం క్షణం మారుతున్నాయి. రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఏ మాత్రం ఫలించడం లేదు. ముంబైలో ఉన్న 13 మందిని కలవడానికి కాంగ్రెస్ ట్రుబల్ షూటర్ డీకే శివకుమార్ సోమవారం వెళ్లేసరికి వాళ్లు గోవాకు మకాం మార్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశమైంది. తాజా రాజకీయ పరిణామాలపై నిశితంగా చర్చించారు. . ఈ సమావేశానికి 21 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి మొత్తం 78 మంది కాంగ్రెస్ సభ్యులుంటే, 57 మంది మాత్రమే హాజరయ్యారు. రిజైన్ చేసిన ఎమ్మెల్యేలతో పాటు రాజీనామా చేయని మరో ఆరుగురు ఎమ్మెల్యే లు మీటింగ్‌కు హాజరు కాలేదు. శివణ్ణ, MBTనాగరాజు, రోషన్ బేగ్, బీకే సంగమేష్, అంజలి నింబా ళ్కర్, కె. సుధాకర్ సీఎల్పీ భేటీకి దూరంగా ఉన్నారు. ఇందులో రోషన్ బేగ్ తన పదవికి రాజీనామా చేశారు. రిజైన్ లెటర్‌ను స్పీకర్‌కు సమర్పించారు. ఈయన బీజేపీలో చేరబోతున్నారని సమాచారం . ఈ భేటీకి అసమ్మతి ఎమ్మెల్యే రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డి సోనియాగాంధీతో సమావేశమైన తర్వాత హాజరయ్యారు.
అటు సీఎల్పీలో మెజార్టీ శాసనసభ్యులు మాత్రం ప్రతిపక్షంలో ఉందామని, పార్టీని బలోపేతం చేద్దామనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరో వైపు జులై 21న కేబినెట్ విస్తరణ ఉంటుందని స్పష్టం చేశారు మాజీ సీఎం సిద్ధరామయ్య. అసమ్మతి నేతలు అంతా తిరిగొస్తారని భావిస్తున్నామన్నారు. రామలింగారెడ్డి సహా అసమ్మతి నేతలు తిరిగొస్తారని మాజీ సీఎం చెప్పుకొచ్చారు. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు సిద్ధరామయ్య.
కర్ణాటక సంక్షోభంపై కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా ఆందోళనలు నిర్వహించాయి. సంక్షోభానికి మీరే కారణ మంటే, మీరే కారణమంటూ నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. బెంగళూరులోని విధానసౌద ముందు ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నేతలు, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. బెంగళూరు, మై సూరు,తుమకూరుల్లో కాషాయశ్రేణులు కదం తొక్కాయి. సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు సిద్ధమవుతున్నారు బీజేపీ నేతలు.
కర్ణాటక సంక్షోభం వెనుక బీజేపీ హస్తం ఉందంటూ అధికార జేడీఎస్ మరోసారి ఆరోపణలు చేసింది. తమ ఎమ్మెల్యేలకు వెయ్యికోట్లతో బీజేపీ ఎర వేస్తోందని జేడీఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్- జేడీఎస్ సర్కార్ గట్టేక్కుతుందా లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com