ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌‌కు ఊహించని షాక్

ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌‌కు ఊహించని షాక్
X

ముంబైలోనూ కన్నడ రాజకీయాలు ప్రకంపనలు రేపాయి. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి బాంబేకు వెళ్లిన కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నిషేదాజ్ణలను డీకే ఉల్లంఘించారని, అందుకే ఆయన్ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. బుధవారం నుంచి బాంబేలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రెబల్ ఎమ్మెల్యేలతో మాట్లాడడానికి ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ రాగా, ఆయనకు ఊహించని షాక్ తగిలింది. ఎమ్మెల్యేలు ఉన్న హోటల్‌లోకి పోలీసులు డీకేను అనుమతించలేదు. ఆ హోటల్‌లో తాను రూమ్‌ బుక్ చేసుకున్నానని చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలు ఒప్పుకుంటేనే లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేశారు.

పోలీసులు అనుమతించకపోవడంతో చేసేదేం లేక హోటల్ ముందున్న చెట్టు కిందే డీకే వెయిట్ చేశారు. వర్షం పడుతున్న లెక్క చేయకుండా ఎమ్మెల్యేల కోసం నిరీక్షించారు. అక్కడే టిఫిన్ కూడా చేసిన డీకే, ఎమ్మెల్యేలను కలవకుండా వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఐతే, డీకేను కలవడం తమకు ఇష్టం లేదని రెబల్ ఎమ్మెల్యేలు కుండబద్దలు కొట్టారు. డీకే నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు హోటల్ ముందు గుమికూడి డీకేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో హోటల్ పరిసరాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. శాంతి భద్రతల దృష్ట్యా హోటల్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.

ఇక, ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. స్పీకర్ తీరును నిరసిస్తూ అసంతృప్త ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉద్దేశపూర్వకం గానే స్పీకర్ తమ రాజీనామాలను ఆమోదించలేదని ఎమ్మెల్యేలు ఆరోపించారు. రాజ్యాంగబద్దంగా నిర్వహించాల్సిన విధులను స్పీకర్ నిర్వహించడం లేదన్నారు. మరోవైపు బెంగళూరులో బీజేపీ ధర్నా నిర్వహించింది. మాజీ సీఎం యడ్యూరప్పతో బీజేపీ నాయకులు విధానసౌధ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. అసమ్మతుల రాజీనామాలపై స్పీకర్‌ పక్షపాతధోరణి వ్యవహరిస్తున్నారని కమలదళం కస్సుమంటోంది.

Tags

Next Story