సెమీఫైనల్‌ మ్యాచ్‌‌కు అవకాశం ఇచ్చిన వరుణుడు.. భారత్‌ లక్ష్యం 240..

మాంచెస్టర్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య సెమీఫైనల్‌ మ్యాచ్‌ తిరిగి ప్రారంభమైంది. వర్షం కారణంగా నిన్న ఆట ఆగిన దశ నుంచే బుధవారం తిరిగి ప్రారంభించారు. 46.1 ఓవర్ల దగ్గర న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ వర్షం కారణంగా ఆగిపోయింది. అప్పటికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. కివీస్‌ జట్టు మరో 3.5 ఓవర్లు ఆడింది.. 239 పరుగులు చేసింది. చిన్న విరామం తర్వాత భారత ఇన్నింగ్స్‌ మొదలవుతుంది. 240 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది.

మంగళవారం మ్యాచ్‌కు అడ్డుపడిన వరుణుడు బుధవారం కూడా దోబూచులాడాడు. ఉదయం కూడా మాంచెస్టర్‌లో వర్షం కురిసింది. దీంతో ఆట సాధ్యమవుతుందా లేదా అన్న అనుమానాలు కలిగాయి. ఉదయం 9 గంటలకల్లా వాన వెలిసి.. వెలుతురు వచ్చింది. సూర్యుడు కూడా రావడంతో.. ఆట కొనసాగింపుపై అనుమానాలు తొలగిపోయాయి. మరో నాలుగు గంటల వరకు వర్షం కురిసే అవకాశాలు లేవని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుండడంతో... ఇవాళ కచ్చితంగా మ్యాచ్‌ ఫలితం వెలువడే అవకాశాలున్నాయి.

మరోవైపు... ఆటకు అవకాశం ఇచ్చిన వరుణుడు.. భారత్‌ విజయావకాశాలపై మాత్రం ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు రోజులుగా వర్షం తో తడిసిన గ్రౌండ్‌... మందకొడిగా తయారైంది. దీంతో షాట్లు ఆడడం అంత ఈజీ కాదు. పైగా న్యూజిలాండ్‌ బౌలర్లంతా సీమ్‌ బౌలర్లు. మాంచెస్టర్‌లో ప్రస్తుతమున్న వాతావరణం వారి బౌలింగ్‌ శైలికి సరిగ్గా సరిపోతుంది. బౌల్డ్‌, ఫెర్గూసన్‌ లాంటి బౌలర్లు ఆదిలో చెలరేగితే టీమిండియాకు కష్టాలు తప్పవని నిపుణుల అంచనా. అయితే ఎండ బాగా కాస్తే మాత్రం.. ఓ గంట తర్వాత పరిస్థితులు బ్యాటింగ్‌కు అనుకూలిస్తాయని... అప్పుడు భారత్‌ విజయావకాశాలు మెరుగుపడతాయని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. ‌

Tags

Next Story