జగన్ మాటలకు, చేతలకు పొంతన లేదు : చంద్రబాబు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాటలకు, చేతలకు పొంతనలేదని.. చెప్పేదొకటి, చేసేదొకటిగా పాలన సాగుతోందని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించారు. బడ్జెట్ సమావేశాలు జరిగే 14రోజులు ప్రజా సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించాలని.. అవి పరిష్కారం అయ్యేంత వరకు పోరాడాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన టీడీఎల్పీ సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై అసెంబ్లీలో చర్చ చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. విత్తనాల కొరత, నీటి సమస్యలపై చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడుల గురించి ప్రస్తావనను సభలో లేవనెత్తాలని, ఎమ్మెల్యేలకు జరిగిన పరాభవంపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని తీర్మానించారు.
40 రోజుల్లోనే వైసీపీ ప్రభుత్వ నిర్వాకాలు, ఆ పార్టీ నేతల దాడులు-దౌర్జన్యాలను ప్రజలు ఏవగించుకుంటున్నారన్నారు చంద్రబాబు. బడ్జెట్ సమావేశాలు జరిగే 14రోజులు ప్రజా సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించాలని.. అవి పరిష్కారం అయ్యేంత వరకు పోరాడాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టని వైసీపీ ప్రభుత్వం... టిడిపి కార్యకర్తలను, నాయకులను టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని... శాంతిభద్రతలు దెబ్బతిని.. ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో టీడీపీ నాయకులపై వరుసగా జరుగుతున్న దాడులను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. గత 40రోజుల్లో పొలిటికల్ టెర్రరిజం పీక్ స్టేజ్‌కు చేరిందన్నారు. ఇళ్లపై సామూహిక దాడులు, మహిళలపై దౌర్జన్యాలు, భూములు సాగు చేసుకోనివ్వక పోవడం, గ్రామాలు ఖాళీచేసి పోవాలని బెదిరించడం.. ఇలా వైసీపీ అరాచకాలకు అంతే లేకుండా పోయిందన్నారు. అటు.. మా హయాంలో ఎక్కడా విత్తనాలు, ఎరువుల కోసం రైతులు రోడ్డు ఎక్కే పరిస్థితి కల్పించలేదన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. రైతులను కాపాడలేక విఫలమై.. మాపై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. రాయదుర్గంలో రైతు ఈశ్వరప్ప మరణానికి ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. మొత్తానికి రైతు సమస్యలతో పాటు.. టీడీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై ప్రధానంగా అసెంబ్లీలో ప్రస్తావించేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com