ఏపీలో విత్తనాల కోసం రైతన్న పడిగాపులు

ఏపీలో విత్తనాల కోసం రైతన్నల పడిగాపులు వారి ప్రాణాల మీదకు తెచ్చింది. విత్తనాల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న అన్నదాతలు అర్ధాంతరంగా ప్రాణాలు విడుస్తున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది.
ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ యార్డుకు వేరుశనగ విత్తనాల కోసం వచ్చి ఓ రైతు అక్కడే కుప్పకూలిపోయాడు. వేపరాళ్లకు చెందిన ఉప్పర ఈశ్వరప్ప వేరుశనగ విత్తనాల కోసం ఉదయమే ఇంటి నుంచి యార్డుకు బయలుదేశాడు. క్యూలో నిలబడి టోకెన్ కూడా తీసుకున్నాడు. బయటకు వచ్చి తోటి రైతులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే రైతులు అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా..అప్పటికే ఈశ్వరప్ప మరణించినట్టు వైద్యులు తెలిపారు. రైతు ఈశ్వరప్ప కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిసింది. ఇంటి పెద్దదిక్కు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. రైతు మృతిపై ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి సానుభూతి తెలిపారు. అతని కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com