20 ఏళ్లకే కోట్ల రూపాయల వ్యాపారం.. హైద్రాబాద్ కుర్రాడి సక్సెస్ స్టోరీ..

20 ఏళ్లకే కోట్ల రూపాయల వ్యాపారం.. హైద్రాబాద్ కుర్రాడి సక్సెస్ స్టోరీ..

నీ వయసేంటి.. నువు చదువుతున్న పుస్తకాలేంటి.. అయినా ఏడో క్లాస్‌కి ఏమర్ధమవుతుందని ఆ స్టాక్ మార్కెట్ పుస్తకాలు చదువుతున్నావని అమ్మానాన్న ఎప్పుడూ అన్లేదు. అందుకే స్టాక్ మర్కెట్ గురించి బెంజమిన్ గ్రాహం రాసిన ఆర్టికల్ అప్పుడే చదివి ఒక అవగాహనకు వచ్చేశాడు. అసలు మార్కెట్‌లో వస్తు రూపంలో లేని దానిపై పెట్టుబడి పెట్టడం ఏమిటి.. వాటిద్వారా డబ్బులు సంపాదించడం ఏమిటి.. అంతా వింతగా అనిపించింది హైదరాబాద్‌కి చెందిన సంకర్ష్‌కి. చదువుకుంటున్న పుస్తకాలు పక్కన పెట్టి స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన పుస్తకాలు ఏడాది పాటు చదివి.. మార్కెట్ మీద అవగాహన పెంచుకున్నాడు. మూతి మీద మీసం కూడా రాని ఈ కుర్రాడు 2017లోనే ఓ స్టార్టప్‌ను ప్రారంభించి.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న 14 ప్రముఖ కంపెనీలకు షేర్స్ మరియు స్టాక్ మార్కెట్ గురించిన సలహాలు ఇస్తున్నాడు. చిన్న వయసులోనే సావర్ట్ అనే స్టాక్ మార్కెట్ అడ్వైజరీ కంపెనీ స్థాపించి దానికి సీఈఓగా, ఫౌండర్‌గా కొనసాగుతున్నాడు.

20 ఏళ్ల వయసులో ఓ కుర్రాడికి ఉండాల్సిన లక్షణాలు ఏవీ అతడిలో లేవు. ఫ్రెండ్స్, సినిమాలు, షికార్లు అన్నింటినీ పక్కన పెట్టి తన లక్ష్యం వైపే దృష్టి సారించాడు. పాకెట్ మనీ కోసం నాన్న ఇచ్చిన డబ్బులతో షేర్స్ కొనేవాడు. అందరిలానే తెల్లారిపాటికే డబ్బులు డబుల్ అవుతాయని ఆశ పడ్డాడు. కానీ అసలుకే మోసం. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేది కాదు. అప్పుడర్థమైంది. షేర్ మార్కెట్ అనేది ఒక మహా సముద్రం అని. దాన్ని అర్థం చేసుకోవాలి.. బాగా స్టడీ చేయాలి.. ఆ తరువాతే అందులో పెట్టుబడి పెట్టాలని తెలుసుకున్నాడు. లేకపోతే అందులో వేలు పెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి స్టాక్ మార్కెట్‌పై పరిశోధనలు సాగించాడు సంకర్ష్. గడచిన పదేళ్ల స్టాక్ మార్కెట్ స్థితి గతులను కూడా బాగా వంటబట్టించుకున్నాడు. ఆ తరువాతే సొంతంగా ఓ కంపెనీ పెట్టాలనే ఆలోచనకు రూపకల్పన చేశాడు. సాధారణ మధ్యతరగతి నుంచి వచ్చిన సంకర్ష్ తండ్రి చంద్రశేఖర్.. ఇప్పుడు కొడుకు కంపెనీకి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్నారు. స్టాక్ మార్కెట్ గురించి ప్రజలకి చాలా అపోహలు ఉన్నాయని.. ఓ మధ్యతరగతి వ్యక్తి కూడా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించేలా చేయాలనేదే తన లక్ష్యం అనే సంకర్ష్ అభిలాష అభినందనీయం.

Tags

Read MoreRead Less
Next Story