వచ్చే వారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఈనెల 18,19 తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. తెలంగాణ నూతన మున్సిపల్ చట్టం ఆమోదం కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నూతన చట్టం కోసం 18న అసెంబ్లీ 19 న మండలి సమావేశం కానున్నది. జులై 18 న బిల్లు ప్రతులను శాసన సభ్యులకు అందచేసి దానిమీద చర్చించడానికి ఒక రోజు సమయం ఇచ్చి జులై 19న చర్చించి చట్టంగా ఆమోదం పొందేలా ప్లాన్ చేస్తున్నారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ అసెంబ్లీ మండలి సమావేశాల్లో కేవలం మున్సిపల్ బిల్లును ఆమోదించేందుకు మాత్రమే నిర్వహిస్తున్నారు. ప్రశ్నోత్తరాలు తదితర అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఏమీ ఉండవు. మున్సిపల్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత అగస్టు మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. కాగా మున్సిపల్ బిల్లుకు తుదిరూపం తెచ్చేందుకు ఇప్పటికే న్యాయశాఖకు పంపినట్లు సీఎం తెలిపారు..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com