ఆంధ్రప్రదేశ్

టీటీడీ జేఈవోగా ధర్మారెడ్డినే.. జగన్ నియమించడానికి కారణం ఏంటంటే..

టీటీడీ జేఈవోగా ధర్మారెడ్డినే.. జగన్ నియమించడానికి కారణం ఏంటంటే..
X

టీటీడీ ప్రత్యేక అధికారిగా ధర్మారెడ్డి నియమితులయ్యారు. రేపు ఉదయం ఏడున్నర గంటలకు ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కాలినడకన కొండపైకి వెళ్లి టీటీడీ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరిస్తారు. కేంద్ర సర్వీసుల నుంచి డిప్యూటేషన్‌పై రాష్ట్రానికి వచ్చిన ధర్మారెడ్డి... గతంలో వైఎస్సార్‌ హయాంలోను కొండపై పనిచేశారు. సామాన్యులకు శ్రీవారి దర్శనభాగ్యం కల్పించడంలో ఆయన తెచ్చిన మార్పులు, సంస్కరణలు నేటికీ అమలవుతున్నాయి. టీటీడీ బోర్డులో ప్రక్షాళన కోసం ముఖ్యమంత్రి Y.S జగన్ ఏరికోరి ధర్మారెడ్డినే నియమించడంతో భక్తుల్లో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి.

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టడం ఏవీ ధర్మారెడ్డికి ఇదే తొలిసారి కాదు. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 జులై 5 నుంచి.. 2006 సెప్టెంబర్ 9 వరకు టీటీడీ జేఈఓ హోదాలో ప్రత్యేకాధికారిగా విధులు నిర్వర్తించారు. సమర్థంగా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో.. ఆయన్ను మళ్లీ కొండపై నియమించింది నాటి సర్కార్. రెండో విడతలో 2008 ఏప్రిల్ 2 నుంచి 2010 ఆగస్టు 31 వరకు టీటీడీలో పనిచేశారాయన. తన హయాంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారు ధర్మారెడ్డి. అవే ఇప్పుడాయన్ని మళ్లీ కొండపైకి చేర్చాయి.

ఏడుకొండలవాడి క్షణకాల దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి నుంచు భక్తులు వస్తుంటారు. వ్యయ ప్రయాసలను లెక్కచేయరు. అలాంటి భక్తులకు, కలియుగ దైవానికి మధ్య వారధిగా టీటీడీ ఉండాలన్నది ధర్మారెడ్డి అభిప్రాయం. ఆయన పనితీరు ఆ దిశగానే ఉండేది. తిరుమలలో సామాన్యులకు పెద్దపీట వేశారాయన. వీలైనంత మందికి, వీలైనంత వేగంగా శ్రీవారి దర్శనభాగ్యం కల్పించే ఏర్పాట్లు చేశారు. తిరుమల చేరిన భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేసారు.

తిరుమల నాలుగు మాఢవీధుల విస్తరణలో ధర్మారెడ్డిది కీలక పాత్ర. బ్రహ్మోత్సవాల సమయంలో.. శ్రీవారిని ప్రతి ఒక్క సామాన్య భక్తుడు దర్శించుకునేలా ఏర్పాట్లు చేసిన ఘనత ధర్మారెడ్డిదే. నాలుగు మాఢవీధుల్లో స్వామి వారిని తిలకించడానికి వీలుగా వాటిని విస్తరించారు. తొక్కిసలాటకు ఏమాత్రం ఆస్కారం లేకుండా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. దీనివల్ల లక్షలాది మంది భక్తులకు శ్రీవారి వాహన సేవలు తిలకించే మహాభాగ్యం కలిగింది.

మహాలఘు దర్శనం ధర్మారెడ్డి క్రెడిటే! లఘు దర్శనం అమల్లో ఉన్న సమయంలో రోజుకు 40 వేల నుంచి 50 వేల మంది మాత్రమే శ్రీవారిని దర్శిచుకునేవారు. ఇప్పుడా సంఖ్య రెట్టింపు అయింది. వెంగమాంబ అన్నదానం కాంప్లెక్స్ నిర్మాణం చేయించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ధర్మారెడ్డి ఘనతలు ఎన్నో. శ్రీవారిని దర్శించుకున్న ఏ ఒక్క భక్తుడు.. లడ్డూ తీసుకోకుండా తిరిగి వెళ్ళరాదనే ధ్యేయంతో ప్రతి నిత్యం అత్యధికంగా లక్షా యాభై వేల లడ్డూలు తయారు చేసేలా చర్యలు తీసుకోవడం థర్మారెడ్డికి మంచి గుర్తింపు తెచ్చింది. బూందీ పోటు తయారీ కేంద్రం మార్పు ఈయన హయాంలో జరిగిందే.

భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్లే క్యూలైన్లలో మార్పులపై ధర్మారెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపించి ఆ దిశగా చర్యలు చేపట్టారు. అడుగడుగునా సామాన్య భక్తులకు పెద్దపీట వేసారని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టీటీడీ ప్రక్షాళన చేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి జగన్.. బ్రహ్మాండమైన ట్రాక్ రికార్డు ఉండడంతో ధర్మారెడ్డిని టీటీడీలో ప్రత్యేకధికారిగా నియమించారు. ఇందుకు వైఎస్ కుటుంబంతో సాన్నిహిత్యం కూడా ధర్మారెడ్డికి కలిసొచ్చింది. కొండపైకి ఆయన రాకతో సామాన్య భక్తులకు మరోసారి ప్రాధాన్యం దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Next Story

RELATED STORIES