ఓటమికి కారణం అదే : కోహ్లీ

ఓటమికి కారణం అదే : కోహ్లీ

ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగిన టీమిండియా సెమీస్‌పోరులో చేతులెత్తేసింది. 120 కోట్ల మంది భారతీయుల కల కలాగే మిగిలిపోయింది. మూడోసారి వరల్డ్ కప్ సాధించాలన్న భారత్ ఆశలు గల్లంతయ్యాయి. న్యూజిలాండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైన‌ల్లో భారత్ 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్ 18 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. పోరాడి ఓడిన కోహ్లీసేన మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

కింగ్‌ కోహ్లీ కన్న బంగారు కల కలగానే ఎందుకు మిగిలిపోయింది..? లీగ్‌ దశలో ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు, ఒక్క ఓటమితో 14పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది టీమిండియా. ఆరంభంలోనే కీలక ఆటగాడు శిఖర్‌ ధావన్‌ గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించండం తొలి ఎదురుదెబ్బ. దీంతో మిడిలార్డర్‌లో సరైన కూర్పు లేకపోవడం లీగ్‌ దశలో టీమిండియాను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.అయితే టాప్‌ ఆర్డర్‌లో రోహిత్‌ శర్మ వరుస శతకాలతో ఫుల్‌ ఫామ్‌లో ఉండటం, సారథి కోహ్లీ సైతం కీలక ఇన్నింగ్స్‌లు ఆడటం, మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ కూడా బ్యాట్‌ ఝళిపించడంతో లీగ్‌ దశను సులభంగానే దాటేశాం. కానీ కీలక న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో మాత్రం ఈ అంశాలే జట్టుకు ప్రతికూలంగా మారాయి. పిచ్‌, వాతావరణం కూడా టీమిండియా పరాజయానికి కారణంగా నిలిచాయి. అటు తక్కువ పరుగుల వ్యవధిలోనే టాప్ఆర్డర్‌ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో మొదటి నుంచే టీమిండియా ఆత్మరక్షణ ధోరణితో ఆడాల్సి వచ్చింది. జట్టు విజయ తీరాలకు చేర్చేందుకు జడేజా, ధోని చేసిన పోరాటం వృథా అయ్యింది.

టాపార్డర్ గా ఉన్న రోహిత్‌ శర్మ, విరాట్‌ ​కోహ్లి, కేఎల్‌ రాహుల్‌లు తలో పరుగు చేసి పెవిలియన్‌ చేరడంతో భారత్‌ కష్టాల్లో పడింది. పంత్ 32 , పాండ్య32 పరుగులతో గొప్ప పోరాటం చేసి స్కోరుబోర్డును నిలబెట్టే ప్రయత్నం చేశారు. వారిద్దరూ వెంటవెంటనే ఔట్‌ అయినా జడేజా వీరోచిత పోరాటం చేశాడు. ఆశల్లేని దశ నుంచి ఆఖరి దాకా పోరాడితే విజయం మనదే అనే స్థితికి తీసుకొచ్చాడు. ధోనీ సహకారంతో ఒత్తిడిలోనూ కివీస్‌ బౌలర్లపై ఆధిపత్యం కొనసాగించాడు. కానీ కీలక సమయంలో జడేజా 77 పరుగుల వద్ద, ధోనీ 50 పరుగుల వద్ద ఔట్‌ కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. టాపార్డర్‌ పెవిలియన్‌కు క్యూ కడుతున్నా.. కివీస్‌ బౌలర్లును సమర్థవంతంగా ఎదుర్కొని మ్యాచ్‌పై పంత్‌ ఆశలు రేకెత్తించేలా చేశాడు. అయితే కీలక సమయంలో అనవసరపు షాట్‌ కోసం యత్నించి ఔట్‌గా వెనుదిరగడం అందరినీ నిరుత్సాహానికి గురిచేసింది.

క్రీజులో కొండంత ధైర్యం ఎంఎస్‌ ధోని ఉండటంతో అందరిలోనూ గెలుపుపై ఆశ నెలకొని ఉంది. అందరి అంచనాలను నిజం చేస్తూ 49 ఓవర్‌లో ఫెర్గుసన్‌ వేసిన తొలి బంతిని ధోని సిక్సర్‌ కొట్టాడు. రెండో బంతిని కీపర్‌ ఎండ్స్‌వైపు మళ్లించి రెండు పరుగులు తీసే ప్రయత్నం చేశాడు. అయితే న్యూజిలాండ్‌ ఫీల్డర్‌ మార్టిన్‌ గప్టిల్‌ బుల్లెట్‌ త్రోకు సీన్‌ అంతా మారిపోయింది. అతడి మెరుపు ఫీల్డింగ్‌కు ధోని రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా ఓటమి ఖాయమైంది. అభిమానుల ఆశలు గాల్లో కలిసిపోయాయి. అర్దసెంచరీతో రాణించినా కీలక సమయంలో ధోని అవుటవ్వడం అందరినీ తీవ్రంగా నిరాశపరిచింది. న్యూజిలాండ్‌ను ఛేదించగలిగే స్కోరుకే అవుట్ చేసినా లక్ష్య ఛేదనలో చతికిలపడ్డామన్నారు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. కివీస్ తమకంటే ధైర్యసాహసాలు ప్రదర్శించి విజయం సాధించిందని కొనియాడాడు. బంతితో తొలుత అద్భుతంగా రాణించినప్పటికీ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యామని, తమ ఓటమికి అదే కారణమని పేర్కొన్నారు విరాట్ కోహ్లీ.

Tags

Next Story