ఏపీ బడ్జెట్.. జగన్ పెద్ద పీట వేసింది వీటికే..

ఏపీ బడ్జెట్.. జగన్ పెద్ద పీట వేసింది వీటికే..

రైతు, సంక్షేమం, విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తూ ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. ఈసారి బడ్జెట్‌ అంచనాను సుమారు రెండున్నర లక్షల కోట్లుగా ప్రతిపాదించింది. అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన.. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి 19.32 శాతం పెరుగుదల ఉందన్నారు. తరువాత వ్యవసాయ బడ్జెట్‌ను మరో మంత్రి బొత్స ప్రవేశ పెట్టారు. ఇప్పటికే ఏపీ బడ్జెజ్‌పై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విమర్శలు చేస్తోంది. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరగనుంది.

ఏపీ అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వ తొలి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ అంచనా 2 లక్షల 27వేల 974 కోట్ల రూపాయలుగా ప్రకటించారు. రెవెన్యూ వ్యయం 1,80,475 కోట్లు అని మంత్రి వెల్లడించారు. 2018-19 బడ్జెట్‌తో పోలిస్తే ఈ బడ్జెట్‌లో 19.32 శాతం పెరుగుదల ఉందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన రెండంకెల వృద్ధిరేటుపై సమీక్షిస్తున్నామని బుగ్గన తెలిపారు. రెండంకెల వృద్ధి ఉంటే ప్రజలు ఇంకా పేదరికంలో ఎందుకున్నారో పరిశీలిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం సంక్షేమ రంగానికి అధికంగా 14,142 కోట్లు కేటాయించిదని గుర్తు చేశారు. వృద్ధులు, వితంతువుల పెన్షన్‌కు 12,801 కోట్లు, ఆశా వర్కర్లకు 455.85 కోట్లు, డ్వాక్రా మహిళల వడ్డీ లేని రుణాలకు 1140 కోట్లు కేటాయించినట్టు చెప్పారు.

బడ్జెట్‌లో వైద్య రంగానికి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కోసం 1740 కోట్లు కేటాయించినట్టు వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రులను అధునీకరించాలని నిర్ణయించారు. ఇందుకోసం 15 వందల కోట్లు కేటాయించారు. ప్రతి ఒక్కరికి మెరుగైన విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు బుగ్గన. విద్యారంగానికి మొత్తంగా 32, 618. 46 కోట్ల రూపాయలు కేటాయించారు. ఉన్నత విద్య కోసం 3,021.63 కోట్లు, మధ్యమిక విద్యకు 21,612.30 కోట్లు, అమ్మఒడి పథకానికి 6,455 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. వైఎస్‌ఆర్‌ గృహ పథకానికి 5 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం 1150కోట్లు, కాపుల సంక్షేమానికి 2000కోట్లు, చేనేత కార్మికులకు వైఎస్‌ఆర్‌ భరోసా కింద 200కోట్లు కేటాయించారు.

డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కోసం బడ్జెట్‌లో 1140 కోట్లు కేటాయించినట్లు మంత్రి బుగ్గన వెల్లడించారు. ఏపీఎస్‌ ఆర్టీసీకి రూ.1000కోట్లు కేటాయించారు. ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు. 2021 జూన్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. మొత్తంగా సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.13,139.13 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

వ్యవసాయ బడ్జెట్‌ను.. వ్యవసాయ మంత్రి కన్నబాబుకు బదులు బొత్స సత్యనారాయణ ప్రవేశ పెట్టారు. మొత్తం 28 వేల 866 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రతిష్టాత్మకమైన రైతు భరోసాకు 8 వేల 750 కోట్లు, ధరల స్థీరికరణ నిధికి 3 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. బడ్జెట్‌ పద్దులు ముగిసిన వెంటనే అసెంబ్లీని సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం రోజున ఈ బడ్జెట్‌పై ప్రతిపక్షాలు మాట్లాడనున్నాయి. ప్రతిపక్షాలు లేవనెత్తే విషయాలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు సంబంధిత మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు.

Tags

Next Story