జగన్ రాజీనామా చేస్తారో.. లేక ప్రజలకు క్షమాపణలు చెబుతారో : చంద్రబాబు
సున్నావడ్డీపై రెండో రోజు కూడా ఏపీ అసెంబ్లీలో దుమారం చెలరేగింది. గురువారం జరిగిన చర్చ సందర్భంగా సున్నావడ్డీ పథకంపై సీఎం జగన్ చేసిన ఆరోపణలకు.. ప్రతిపక్ష నేత చంద్రబాబు ధీటుగా బదులిచ్చారు. సున్నావడ్డీకి సంబంధించిన ఆధారాలు, రికార్డులు సభ ముందు ఉంచారు. ఇప్పుడైనా సీఎం జగన్ రాజీనామా చేస్తారో... లేక ప్రజలకు క్షమాపణలు చెబుతారో నిర్ణయించుకోవాలని అన్నారు చంద్రబాబు.
దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్...తానేదో గొప్పగా పథకాలు అమలు చేసినట్లుగా చంద్రబాబు చెబుతున్నారని.. ఆయన ప్రసంగాలు మొదటిసారిగా విన్నవాళ్లకు గొప్పగా చేశారని అనిపిస్తుందని జగన్ ఎద్దేవా చేశారు. సీఎం కూడా సున్నావడ్డీకి సంబంధించిన రికార్డులను చదివి వినిపించే ప్రయత్నం చేశారు.
ఇలా జగన్ ప్రసంగిస్తున్న సమయంలో టీడీపీ సభ్యులు అడ్డు తగిలారు. దీంతో వారిపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం 150 మందిమి ఉన్నామని.. తాము తల్చుకుంటే టీడీపీ సభ్యులు వాళ్ల స్థానాల్లో కూడా కూర్చోలేరని హెచ్చరించారు. జగన్ వ్యాఖ్యలపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం తలెత్తింది.
జగన్ మాట్లాడుతున్న తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. పదే పదే హెచ్చరించే ధోరణిలో సీఎం మాట్లాడుతున్నారని అన్నారు. ఇలా సంఖ్యచూపిస్తూ బెదిరిస్తే ప్రజాస్వామ్య స్పూర్తి ఎక్కడుంటుందని ప్రశ్నించారు.
సీనియర్ నేత అన్న గౌరవం కూడా లేకుండా చంద్రబాబుపై జగన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు టీడీపీ ఎమ్మెల్యేలు..సున్నా వడ్డీ పథకంపై సభను తప్పుదోవపట్టించడమే కాకుండా.. చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేయడంపై మండిపడ్డారు. బడ్జెట్ ప్రవేశపెట్టే కంటే ముందే సభలో జీరో వడ్డీ ఇష్యూ అధికార-విపక్షాల మధ్య హీట్ పెంచింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com