అక్కడ గెలిచేది ఎవరు?.. ఢీ అంటే ఢీ అంటున్న ప్రధాన పార్టీలు

అక్కడ గెలిచేది ఎవరు?.. ఢీ అంటే ఢీ అంటున్న ప్రధాన పార్టీలు

తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరిగి ఏడాదికాలమైనా పూర్తవ్వకముందే.. మరో ఉప.ఎన్నిక సమరం తెరపైకి వచ్చింది. TPCC అధ్యక్షుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న సీట్ కావడంతో.. అన్ని పార్టీల ఫోకస్ అంతా ఆ స్థానంపైనే పడింది. ఈ నేపథ్యంలో.. వరుసగా ఐదు పర్యాయాలు గెలిచిన కాంగ్రెస్ పట్టుకోసం పోరాటం చేస్తుండగా.. ఎలాగైనా గెలవాలంటూ అధికార TRS పార్టీ ఆరాటపడ్తోంది. హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంపై Tv5 స్పెషల్ పొలిటికల్ స్టోరీ.

హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక ప్రకటనకు ఇంకా సమయమున్నా.. గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదును పెడ్తున్నాయి. ఇప్పటివరకు.. ఈ నియోజకవర్గంలో విజయం కోసం ప్రయత్నించిన TRS.. ఈసారి ఎలాగైనా ఇక్కడ గెలవాలని పక్కాగా ప్లాన్ తో వెల్తోంది. మరోవైపు. మూడుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సైతం.. తన పట్టును నిలుపుకునేందుకు క్యాడర్ ని సన్నద్దం చేస్తున్నారు. గత నెలరోజులుగా.. వారానికి రెండు, మూడు సార్లు మండలాల వారీగా ముఖ్య కార్యకర్తలతో సమావేశమై.. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రస్తుతం నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. తిరిగి ఈ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని గెలుపించుకుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులోభాగంగానే.. మండలాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలను ఏర్పాటుచేసి.. పార్టీ పరిస్థితిని సమీక్షించి.. పార్టీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే సమాచారం సేకరిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో.. ఆయా మండలాల నుంచి ద్వితీయ శ్రేణి నాయకులంతా అధికార పార్టీలో చేరడంతో.. వారిని తిరిగి పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. తాను నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించి.. తన పట్టును అధిష్టానం ముందు మరోసారి నిరూపించుకునేందుకు గట్టి ప్రణాళికలతో ఆయన ముందుకెళ్తున్నారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే, ఉత్తమ్ సతీమణి పద్మావతి పోటీ చేయడం లాంఛనమేనని క్యాడర్ అంటోంది.

నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలిచిన ఊపులో.. పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. అందుకు తగ్గట్టే.. అమిత్ షా సహా మిగతా కీలక నాయకులంతా తెలంగాణపై ఫోకస్ పెట్టిన సంగతి తెల్సిందే. అధికార టీఆరెస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల పోరు నడుమన బీజేపీ సైతం ఉప.ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధిష్ఠానం సూచనల మేరకు.. రాష్ట్ర నాయకులు ఇక్కడ పాగా వేయాలని.. క్షేత్రస్థాయిలో పావులు కదుపుతున్నారు. నియోజకవర్గ ఓటర్లను తనవైపు తిప్పగలగే నాయకుడి వేటలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. తమ జైత్రయాత్ర ఇక్కడినుంచే మొదలుపెట్టాలని బీజేపీ సైతం ఉవ్విళ్లూరుతోంది. మొత్తానికి హుజూర్ నగర్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు సవాలుగా మారింది. మరి ఎవరు విజేతగా నిలిచి సత్తా చాటతారో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story