తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపిన బీజేపీ
తెలుగు రాష్ట్రాల్లో కమలం జెండా రెపరెపలాడేలా కసరత్తు చేస్తోంది బీజేపీ ఆధినాయకత్వం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వ్యూహలు రచిస్తోంది. టీఆర్‌ఎస్, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కీలక నేతలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. తెలంగాణలో టీఆర్‌ఎస్ ఎంపీ డిఎస్‌తో సహా పలువురు బీజేపీతో టచ్‌లో ఉన్నారు. అటు ఆదివారం ఏపీలో టీడీపీకి చెందిన పలవురు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు కమలం కండువ కప్పుకోనున్నట్లు తెలిపారు బీజేపీ నేతలు. ఇప్పటికే తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు కైవసం చేసుకున్నా ఉత్సాహంతో ఉన్నా కమల దళం.. టీఆర్‌ఎస్, టీడీపీ నేతలు తమ పార్టీలోకి చేర్చుకునేందుకు వ్యూహ రచన చేస్తోంది. అపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టుతోంది.
తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తి బీజేపీయేనని అన్నారు ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ.గులాబీ కంచుకోటలను బీజేపీ బద్ధలు కొట్టడంతో ఆ పార్టీలో అంతర్మథనం మొదలైందని పేర్కొన్నారు.. టీఆర్‌ఎస్ ఎంపీ డి శ్రీనివాస్‌తో పాటు మరికొంత మంది నేతలు బీజేపీలో చేరుతారని స్పష్టంచేశారు..లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారిపోయాయని చెప్పారు దత్తాత్రేయ.
అటు ఏపీలోనూ ప్రత్యేక వ్యహాన్ని అమలు చేస్తోంది బీజేపీ. ఇప్పటికే కమలం పార్టీలోకి టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎ రమేష్ , టీజీ వెంకటేష్ జంప్ చేయడంతో మరికొంతమంది నేతలను చేర్చుకునేందుకు ప్లాన్ సిద్ధం వేసింది బీజేపీ. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే లు, మంత్రులు బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ . ఇవాళ బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని తెలిపారు. ఏపీలో టీడీపీ ఖాళీ అయిపోవడం ఖాయమని విమర్శించారు కన్నా లక్ష్మీనారాయణ. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలనుకుంటున్నా కమలం వ్యూహం ఎంతవరకు ఫలిస్తోందో.. ఎన్నికల్లో నాటికి ఇతర పార్టీల నుంచి ఎంతమంది బీజేపీ గూటికి చేరనున్నారో చూడాలి మరి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com