రోదసీలో భారత్‌దేశ కీర్తి పతాకను ఎగరవేసే ఘట్టం

రోదసీలో భారత్‌దేశ కీర్తి పతాకను ఎగరవేసే ఘట్టం

మరికొన్ని గంటల్లో భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబోయే ఘట్టం ఆవిష్కృతం కానుంది. అంతరిక్ష పరిశోధనల్లో అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. చంద్రునిపై కాలు మోపే చంద్రయాన్‌-2 ప్రయోగానికి ఇస్రో ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు తెల్లవారుజామున సరిగ్గా 2 గంటల 51 నిమిషాలకు జీఎస్‌ఎల్వీ-ఎమ్‌కే-3 రాకెట్ నిప్పులు చిమ్ము కుంటూ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇప్పుడు అందరి దృష్టి చంద్రయాన్‌-2 ప్రయోగం మీదనే. ప్రపంచ అంతరిక్ష పరిశోధకులు ఈ కీలక ఘట్టం కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నారు.

చంద్రయాన్‌ -2 ప్రయోగానికి సంబందించి ఇస్రో ఓ యానిమేషన్‌ వీడియోను విడుదల చేసింది. ఈ మిషన్‌ ద్వారా మొత్తం 3 మాడ్యూళ్లను చంద్రునిపైకి చేర్చనున్నారు. విక్రమ్ పేరున్న ల్యాండర్, ప్రజ్ఞాన్ పేరుతో ఉన్న రోవర్‌లను జాబిలిపైకి పంపిస్తున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం బ‌రువు సుమారు 3.8 ట‌న్నులు. ఇందులో ప్రొపెల్లంట్ బ‌రువే సుమారు 1.3 ట‌న్నులు. కౌంట్‌డౌన్ పూర్తై నింగిలోకి దూసుకెళ్లిన తర్వాత GSLV-MK3 రాకెట్ కాంపోజిట్‌ మాడ్యూల్‌ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది.

అనంతరం దాని కక్ష్యను శాస్త్రజ్ఞులు దశలవారీగా 16 రోజుల పాటు పెంచుకుంటూ పోతారు. తర్వాత 5 రోజులకు అది చంద్రుడి కక్ష్యలోకి చేరుతుంది. అక్కడ 27 రోజులపాటు చంద్రుడి చుట్టూ తిరుగుతుంది. ఈ దశలో ఆర్బిటర్‌ నుంచి విడిపోయిన ల్యాండర్‌..... మూన్‌ దిశగా పయనించి సెప్టెంబరు 6-7 తేదీల్లో జాబిలి దక్షిణ ధ్రువంపై ల్యాండ్‌ అవుతుంది. దాదాపు 54 రోజుల పాటు నిర్విరామంగా 3 లక్షల 50 వేల కిలోమీటర్లు ప్రయాణించి లక్ష్యాన్ని చేరుకోనుంది చంద్రయాన్‌-2 మిషన్. సెప్టెంబ‌ర్ 6 లేదా 7 తేదీల్లో చంద్రయాన్‌-2 రోవ‌ర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండవుతుంది. మొత్తం ప్రయోగంలో ఇదే కఠినమైనది. ప్రాజెక్టు విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనాల సరసన మనదేశం సగర్వంగా నిలవనుంది.

చంద్రయాన్-2 ప్రాజెక్టు మొత్తం ఖర్చు 978 కోట్లు. ఇది పూర్తిగా మన దేశంలో అభివృద్ధి చేసిన ప్రాజెక్టు. నేవిగేషన్‌, గైడెన్స్‌ కోసం నాసా డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌కు చెల్లింపులు జరిపి మనదేశం ఉపయోగించుకుంది. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 13 రకాల పరికరాలను జాబిలిపైకి పంపిస్తున్నారు. వీటి సాయంతో చంద్రుని ఉపరితలం అధ్యయనం, అక్కడి ఖనిజ వనరులు, నీరు, ఇంధన నిల్వలను విశ్లే షిస్తారు.

2008 సెప్టెంబరు 18న యూపీఏ-1 సర్కారు ఈ మిషన్‌కు ఆమోదం తెలిపింది. 2009 ఆగస్టులో వ్యోమనౌక డిజైన్‌ పూర్తైంది. ఐతే. ల్యాండర్‌ నిర్మాణంలో రష్యా విఫలం కావడంతో మిషన్‌ను వాయిదా వేస్తూ 2013 జనవరిలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరకాలంలో రష్యా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకొంది. దాంతో ఇస్రో పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. అసమాన పట్టుదలతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ల్యాండర్‌ను తయారు చేసింది. ఈ మిషన్‌ను విజయవంతం చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Tags

Next Story