తొలి వరల్డ్ కప్‌ను ముద్దాడేందుకు ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లు ఢీ

ప్రపంచ క్రికెట్ చరిత్రలో మరి కొన్ని గంటల్లో కొత్త ఛాంపియన్ పుట్టుకు రానుంది. క్రికెట్ పుట్టినిళ్లు లార్డ్స్‌లో తొలి వరల్డ్ కప్‌ను ముద్దాడేందుకు ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఆరు వారాలు.. 47 మ్యాచ్‌లతో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించిన వన్డే వరల్డ్‌కప్‌లో ఇక ఫైనల్ వార్ కాసేపట్లో జరగనుంది. కోట్లాది మంది భారతీయుల కలలను చెల్లాచెదురు చేసిన న్యూజిలాండ్.. డిఫెండింగ్ చాంపియన్‌పై పంజా విసిరిన ఇంగ్లండ్ తొలి వరల్డ్ కప్ ను ముద్దాడేందుకు ఢీ అంటే ఢృ అంటున్నాయి. ఈ రెండు జట్లలో ఎవరు విజేతగా నిలిచినా కొత్త ఛాంపియన్ గా రికార్డుల్లో నిలిచిపోతుంది..
రెండు జట్ల బలాలు, గత రికార్డులు చూస్తే ఇంగ్లండ్ ఫేవరెట్ గా బరిలో దిగుతోంది. స్వదేశంలో చివరి 28 వన్డేల్లో ఇంగ్లండ్ కేవలం నాలుగు సార్లు మాత్రమే ఓడింది. మరోవైపు వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకోవడం ఇంగ్లండ్ కు ఇది నాలుగో సారి.. ఆస్ట్రేలియా తరువాత అత్యధికి సార్లు ఫైనల్ కు చేరిన జట్టుగా ఇంగ్లండ్ ఇప్పటికే రికార్డుల్లో నిలిచింది. 1979, 87, 92లలో ఇంగ్లండ్ ఫైనల్ కు చేరింది. కానీ ఒక్కసారి కూడా వరల్డ్ కప్ ను సొంతం చేసుకోలేకపోయింది. ఇప్పుడు సొంతగడ్డపై తొలి ట్రోఫీ నెగ్గి చిరకాల వాంఛ నెరవేర్చుకోవాలని ఆరాటపడుతోంది..
ఈ వరల్డ్ కప్లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్‌దే పైచేయి అయ్యింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లిష్ జట్టు 119 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే కివీస్ ను తక్కువ అంచనా వేస్తే ఇంగ్లండ్ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రపంచకప్‌లో ఇరు జట్లు 9 సార్లు తలపడ్డాయి. ఇందులో 5 సార్లు న్యూజిలాండ్ గెలవగా, 4 సార్లు ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. గత ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ ఫైనల్ కు చేరినా.. ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్ గా నిలిచింది. ఇప్పుడు రెండో ప్రయత్నంలో తొలి కప్ ను అందుకోవాలని ఆరాటపడుతోంది.
ఇరు జట్లలో మిస్టర్ డిపెండ్ బుల్స్ ప్రధానం కానున్నారు. ఇప్పటి ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ ఇద్దరూ గోడల్లా నిలబడి తమ జట్టును ఫైనల్ కు చేర్చడంలో సక్సెస్ అయ్యారు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ , ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు రూట్ ఇద్దరూ సూపర్ ఫాంలో ఉన్నారు. ఫైనల్లోనూ వీరిద్దరి రాణింపే కీలకం కానుంది. ఈ ఇద్దరులో ఎవరు రాణిస్తే ఆ జట్టుదే వరల్డ్ కప్ అనడం అతిశయోక్తి కాదు.
ఇంగ్లండ్ ఓపెనర్లు.. న్యూజిలాండ్ బౌలర్లకు మధ్య ఆసక్తికర పోరు సాగనుంది. ఇంగ్లీష్ ఓపెనర్లు జేసన్ రాయ్, బెయిర్‌స్టో టోర్నీలో అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జంట. ఈ జోడికి న్యూజిలాండ్ పేసర్లు బౌల్ట్ , హెన్రీ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. కచ్చితమైన లెంగ్త్‌లో బౌలింగ్ చేసే ఈ జోడీకి మరో పేసర్ లాకీ ఫెర్గూసన్ తోడైతే ఆతిథ్య జట్టుకు కష్టాలు తప్పవు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com