లావణ్య అవినీతితో అలర్ట్‌ అయిన ఉన్నతాధికారులు

తహశీల్‌దారు లావణ్య అవినీతి డొంక ఓ వైపు కదులుతూనే ఉంది. మరోవైపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనూ చాలా మండలాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం తాహాసిల్ధార్ మల్లికార్జున్ రావు ఓ రైతు సంబంధించిన భూమిని పహానిలో చేర్చేందుకు లంచం తీసుకుంటున్న దృశ్యాలు సోషల్ మిడియాలో హాల్ చల్ చేశాయి. ఈ ఉదంతాలు వెలుగుచూచడంతో మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టరు రొనాల్డ్‌ రోస్‌ వీఆర్వోల అవినీతిపై ఫోకస్‌ చేశారు.

చాలా మండలాల్లో భూ ద్రస్తాల ప్రక్షాళన సక్రమంగా జరగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ ఖాతాలను సరి చేయాలంటూ ప్రతిరోజు మండల కేంద్రాల్లోని తహశీల్దారు కార్యాలయాల ఎదుట రైతులు బారులు తీరుతున్నారు. జిల్లా కేంద్రాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో సైతం ఖాతాలకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతోపాటు పట్టా మార్పిడి, సర్వే నంబర్లు సరిచేసుకోవడం, విస్తీర్ణంలో తేడాలు, సరిహద్దు వివాదాలపై ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నాయి. అవినీతికి అలవాటుపడిన కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది నెలల తరబడి దస్త్రాలు తమ దగ్గరే పెట్టుకొని రైతులను కార్యాలయాలకు తిప్పించుకొంటున్నారు.

రోజు రోజుకు పెరుగుతున్న అవినీతిని నిర్మూలించేందుకు కలెక్టర్ రోనాల్డ్ రోస్ మరోకొత్త అధ్యాయానానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా ప్రజా ఫిర్యాదుల కోసం మా భరోసా అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన అవినీతి నిర్మూలనే ధ్యేయంగా ప్రజా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు.

మా భరోసా పేరుతో ఏకంగా ప్రత్యేక కాల్‌ సెంటరును ఏర్పాటు చేశారు. జిల్లాలో రెవన్యూ, పంచాయితీ రాజ్ శాఖలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై అధికారులు వెదింపులపై ఫిర్యాదు చేసేందుకు 08542-241165 కాల్ సెంటర్ నెంబర్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఉమ్మడి పాలమూరులో గత రెండేళ్లల్లో ఒక్క రెవెన్యూశాఖపైనే అవినీతి నిరోధక శాఖ 8 కేసులు నమోదు చేసింది. పట్టుబడిన వారిలో ఉప తహశీల్దారుతోపాటు రెవెన్యూ ఇన్‌స్పెక్టరు, వీఆర్వో, వీఆర్‌ఏలు ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story