రాజగోపాల్‌రెడ్డి యూటర్న్‌.. కారణం అదేనా..!

రాజగోపాల్‌రెడ్డి యూటర్న్‌.. కారణం అదేనా..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరుపున గెలిచి... ఇప్పటికీ పార్టీలోనే ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేల్లో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఒకరు. అయితే ఇటీవలే ఆయన. ఉన్నట్టుండి.. కాంగ్రెస్‌ హైకమాండ్‌ను ధిక్కరిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరుతానని బహిరంగంగా ప్రకటించిన ఆయన.. ఒకానొక దశలో పెట్టబేడే సర్దుకుని..కమలదళంలో చేరిపోతారంటూ విస్తృత ప్రచారం జరిగింది. అయితే శనివారం ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు మరోసారి అందరిని ఆశ్చర్య పరిచాయి. కాంగ్రెస్‌పై మళ్లీ అభిమానాన్ని ప్రదర్శించారు. కాంగ్రెస్‌ తనకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీ అని.. కాంగ్రెస్‌ బాగు కోసమే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు కొత్త పల్లవి అందుకున్నారు.

కాంగ్రెస్‌ పార్టీకి తాను వ్యతిరేకంగా కాదన్న రాజగోపాల్‌ రెడ్డి.. కేవలం పార్టీలో వాస్తవ పరిస్థితిపైనే మాట్లాడానని అంటున్నారు. అధిష్ఠానం తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోదని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్‌తో యుద్ధం చేయాలంటే కుంతియా, ఉత్తమ్‌ సరిపోరనే తాను అన్నానని.. ఆ వ్యాఖ్యలను తప్పుగా తీసుకుని షోకాజ్‌ నోటీసులు ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు రాజగోపాల్‌రెడ్డి.

అయితే రాజగోపాల్‌రెడ్డి యూటర్న్‌ తీసుకోవడం వెనుక పెద్ద కథే ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ అగ్రనాయకత్వాన్ని విమర్శించిన తర్వాత... ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. అయితే.. బీజేపీ ఎంట్రీ మాత్రం ఆలస్యమైంది. దీనిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన ఓ నేతతో జరిపిన ఫోన్‌ సంభాషణలే దీనికి కారణమని తెలుస్తోంది. బీజేపీలో చేరితే తానే సీఎం అవుతానని అందులో వ్యాఖ్యనించారు రాజగోపాల్‌ రెడ్డి. దీంతో ఆయన్ను పార్టీలోకి తీసుకునే విషయంలో.. స్థానిక బీజేపీ నేతల నుంచి అభ్యంతరం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆయన చేరికను బీజేపీ జాతీయ నాయకత్వం తాత్కాలికంగా పక్కనపెట్టిందనే ప్రచారం జరుగుతోంది. అయితే కోమటిరెడ్డి అనుచరులు మాత్రం.. ఇప్పటికీ ఆయన బీజేపీలో చేరుతారంటున్నారు. ఒక వేళ బీజేపీ నుంచి సానుకూల స్పందన రాకపోయినా కాంగ్రెస్‌లో మాత్రం కొనసాగే అవకాశాలు లేవంటున్నారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో ఉంటారా లేక బీజేపీ గూటికి చేరుతారా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story