తొలిసారి కప్ గెలవాలనే ఆకాంక్షతో..

తొలిసారి కప్ గెలవాలనే ఆకాంక్షతో..

లార్డ్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్లో టాస్ గెలిచి న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వరల్డ్ కప్ ను నెగ్గేందుకు ఆతిథ్య ఇంగ్లండ్ తో న్యూజిలాండ్ ఢీ అంటోంది.. సెమీ ఫైనల్లో బరిలో దిగిన ఆటగాళ్లనే ఇరు జట్లూ కంటిన్యూ చేశాయి.. ప్రస్తుతం పిచ్ పై సన్నటి పొరలా పచ్చిక కనిపిస్తుండడంతో.. బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉంది. ఈ వేదికపై రెండు సార్లు వరల్డ్ కప్ లో 300 లకు పైగా పరుగులు నమోదు అయ్యాయి. దీంతో న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ఏమీ ఆలోచించకుండా బ్యాటింగ్ తీసుకున్నాడు..

రెండు జట్ల బలాలు, గత రికార్డులు చూస్తే ఇంగ్లండ్ ఫేవరెట్ గా బరిలో దిగుతోంది. స్వదేశంలో చివరి 28 వన్డేల్లో ఇంగ్లండ్ కేవలం నాలుగు సార్లు మాత్రమే ఓడింది. మరోవైపు వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకోవడం ఇంగ్లండ్ కు ఇది నాలుగో సారి.. ఆస్ట్రేలియా తరువాత అత్యధికి సార్లు ఫైనల్ కు చేరిన జట్టుగా ఇంగ్లండ్ ఇప్పటికే రికార్డుల్లో నిలిచింది. 1979, 87, 92లలో ఇంగ్లండ్ ఫైనల్ కు చేరింది. కానీ ఒక్కసారి కూడా వరల్డ్ కప్ ను సొంతం చేసుకోలేకపోయింది. ఇప్పుడు సొంతగడ్డపై తొలి ట్రోఫీ నెగ్గి చిరకాల వాంఛ నెరవేర్చుకోవాలని ఆరాటపడుతోంది..

ఈ వరల్డ్‌ కప్‌లీగ్‌ దశలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్‌దే పైచేయి అయ్యింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లిష్‌ జట్టు 119 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే కివీస్ ను తక్కువ అంచనా వేస్తే ఇంగ్లండ్ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రపంచకప్‌లో ఇరు జట్లు 9 సార్లు తలపడ్డాయి. ఇందులో 5 సార్లు న్యూజిలాండ్‌ గెలవగా, 4 సార్లు ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. గత ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ ఫైనల్ కు చేరినా.. ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్ గా నిలిచింది. ఇప్పుడు రెండో ప్రయత్నంలో తొలి కప్ ను అందుకోవాలని ఆరాటపడుతోంది. అయితే లార్డ్స్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్ ల్లోనూ న్యూజిలాండ్ నెగ్గింది..

Tags

Read MoreRead Less
Next Story