మంత్రి బాలినేని పేరుతో ఫోర్జరీ లేఖలు.. సూత్రధారులు ఎవరంటే..

మంత్రి బాలినేని పేరుతో ఫోర్జరీ లేఖలు.. సూత్రధారులు ఎవరంటే..

ప్రకాశం జిల్లాలో మంత్రి బాలినేని పేరుతో ఫోర్జరీ లేఖల బాగోతంపై టీవీ5 ప్రసారం చేసిన వరుస కథనాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అధికారుల్లో కలవరం.. వైసీపీ నేతల్లో అలజడి నెలకొంది. ఈ అంశాన్ని సర్దుబాటు చేయాలని మంత్రి, ఆయన సన్నిహితులు ప్రయత్నాలు చేసినప్పటికీ పోలీసులు రహస్యంగా విచారణ చేట్టారు. బాధ్యులుగా గుర్తించిన ఇద్దరు కానిస్టేబుళ్లను VRకు పంపారు. దీంతో మంత్రి బాలినేని PA అజ్ఞాతంలోకి వెళ్లాడు.

పోలీసుల విచారణలో డొంక కదులుతోంది. ఇది చిన్న స్కామ్‌ కాదని ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. మంత్రి కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ కూడా భాగస్వాములని ప్రాథమికంగా తేల్చారు. తన పేరుపై ఇంత జరుగుతున్నా.. మంత్రి బాలినేని ఇప్పటివరకు స్పందించలేదు. అటు కేసు నమోదు చేయకున్నా... బాధ్యులుగా గుర్తించిన వారందరినీ పోలీసులు విచారించడం, వారి వాంగ్మూలం నమోదు చేస్తుండటం జిల్లాలో సంచలనంగా మారింది. అవినీతిని సహించేది లేదు.. అడ్డదార్లు తొక్కితే ఎవర్నీ వదిలేది లేదని సీఎం జగన్ తరచు చెప్తున్నారు. మరి, ముఖ్యమంత్రి బంధువైన మంత్రి బాలినేని పేరుపై జరిగిన కుంభకోణంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందా అనేది చర్చనీయాంశమైంది.

ప్రకాశం జిల్లాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరుతో వెలుగు చూసిన ఫోర్జరీ లేఖల బాగోతంలో సూత్రధారులు.. పాత్రధారులు ఎవరో పోలీస్‌ శాఖ ఇప్పటికే తేల్చిందని సమాచారం. అయినా కేసు నమోదు కాకపోవడం విశేషం. అధికారం ఇలా చేతికి అందిందో లేదో, అలా అవినీతి దుకాణం తెరిచారు మంత్రి బాలినేని అస్మదీయులు. బాస్ అండ చూసుకుని చేశారో...తెలిసినా మనల్ని ఏమి చేస్తారులే...అధికారం మనదేగా అన్న ధీమాతో చేశారో...ఏది ఏమైతేనేమి...పగ్గాలు చేపట్టిన తొలినాళ్లలోనే ఆ నేతకు మచ్చ తెచ్చే పని చేశారు. అయితే, ఫోర్జరీ లేఖల విషయం గుప్పు మనగానే అప్రమత్తమైన పోలీసు శాఖ తీగలాగితే....సూత్రధారుల్లో ఇద్దరు ఆ శాఖ వారే కావడంతో వారు కూడా ఆత్మరక్షణలో పడ్డారు. దీంతో కేసు నమోదు చేయకుండా సూత్రధారులను, పాత్రధారులను, తెరవెనుక నేతలను, లబ్దిపొందిన అస్మదీయులను రహస్యంగా విచారణ చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి ఒంగోలులోని సీసీఎస్ లో మొన్న ఒకరిని విచారించగా, నిన్నమంత్రి పీఏ ని ఒంగోలు వన్ టౌన్ లో రహస్యంగా విచారించిన పోలీసులు నేడు ఒంగోలులోని మంత్రి కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ ను సీసీఎస్ స్టేషన్ లో విచారించారు. ఈ ఫోర్జరీ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుని తెలుగుదేశం పార్టీ విలేకరుల సమావేశాలు పెట్టి మంత్రిపై విమర్శలకు దిగడంతో అధికార పక్షం కూడా వీటిని ఒక పక్క ఖండిస్తూనే నష్టనివారణ చర్యలను ముమ్మరం చేసింది.

అందులో భాగంగానే పోలీసు విచారణ వేగం తగ్గించాలని మంత్రి ఆదేశించినా.. పోలీసు శాఖ తన స్పీడ్ ఏమీ తగ్గించకుండా తన పని తాను చేసుకుపోతోంది. దీనికి నిదర్శనం మొన్న,నిన్న,నేడు చేసిన విచారణలు. ఇక, నేడో,రేపో ఫోర్జరీ వ్యవహారంపై కేసు నమోదు చేయడం ఖాయమని పోలీసు శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఘటపై జిల్లా ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ ప్రత్యేకంగా టీవీ5తో మాట్లాడుతూ,ఫోర్జరీ లేఖల విషయానికి సంబంధించి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, బాధితులు కూడా ఎవ్వరూ తమకు ఫిర్యాదు చేయలేదని చెప్పారు. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా తాము విచారణ చేస్తున్నామని అన్నారు. తమ శాఖ సిబ్బందిపై వచ్చిన ఆరోణల నేపధ్యంలో వారిని వీఆర్ కి పిలిపించామని ఇది పూర్తిగా శాఖాపరమైనదని దీనికి ఫోర్జరీ వ్యవహారంతో సంబంధం లేదన్నారు. అయితే, ఫోర్జరీ అంశానికి సంబంధించి విచారణ సాగుతోందని ఆయన స్పష్టం చేశారు.

Tags

Next Story