ఇంగ్లాండ్ విన్నర్ కాదు.. ఎక్కువ వికెట్లు తీసిన న్యూజిలాండే విజేత: నెటిజన్స్

ఇంగ్లాండ్ విన్నర్ కాదు.. ఎక్కువ వికెట్లు తీసిన న్యూజిలాండే విజేత: నెటిజన్స్

క్రికెట్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్‌ విజేత నిర్ణయం తీవ్ర దుమారం రేపుతోంది. బౌండరీల ఆధారంగా విన్నర్‌ను ప్రకటించడంపై నెటిజన్లు ICCని ఏకిపారేస్తున్నారు. దీనికంటే రెండు జట్లను సంయుక్త విజేతలు ప్రకటించి ఉంటే కాస్త గౌరవడం ఉండేదని కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య నరాలు తెగే ఉత్కంఠను తలపించిన మ్యాచ్‌లో చివరకు ఇంగ్లీష్ జట్టు విజేతగా నిలిచింది. అయితే బౌండరీల ఆధారంగా విజేతను నిర్ణయించడంపై చాలామంది పెదవి విరుస్తున్నారు. బౌండరీలకు బదులు వికెట్లను కౌంట్ చేసి ఉండాల్సింది కదా అని ప్రశ్నిస్తున్నారు. వికెట్లను కౌంట్ చేస్తే ఇంగ్లాండ్ 241 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఆ లెక్కన ఎక్కువ వికెట్లు తీసిన న్యూజిలాండ్‌ను విన్నర్‌గా ప్రకటించాలి.

బౌండరీ కౌంట్‌ను పరిగణలోకి తీసుకోవడంతో ఇంగ్లాండ్ జట్టు గెలిచింది. అయితే ఏ ప్రాతిపదికన బౌండరీ కౌంట్‌తో విజేతను నిర్ణయించారంటూ మాజీ క్రికెటర్లు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇక ఇది బ్యాట్స్‌మెన్ గేమ్ కాకపోతే మరేంటని నిలదీస్తున్నారు. ఇంత పక్షపాతంగా కేవలం బౌండరీల ఆధారంగా విజేతను నిర్ణయించడం సరికాదని చాలామంది నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్‌లీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. విజేతను నిర్ణయించడానికి ఇలాంటి పద్ధతి ఎంచుకోవడం చాలా దారుణమని ట్విట్టర్‌లో అభిప్రాయపడ్డాడు.

బౌండరీ కౌంట్ నిబంధనను జోక్‌గా ఉందని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ICCపై విరుచుకుపడ్డాడు. సూపర్ ఓవర్ టై అయిన తర్వాత ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించే గత నిబంధనను మార్చి బౌండరీల ద్వారా విజేతను ప్రకటించడంపై గంభీర్‌ ICC తీరును తప్పుబట్టాడు. ఇదొక చెత్త రూల్‌ అంటూ మండిపడ్డాడు.

బౌండరీ రూల్‌ను మాజీ క్రికెటర్‌ కైఫ్‌ కూడా తప్పుబట్టాడు. ఇదోక సడెన్‌ డెత్‌ లాంటిదని ట్విట్టర్‌లో అభిప్రాయపడ్డాడు.బౌండరీల ఆధారంగా విజేతను ప్రకటించడం కాకుండా.. ఇంగ్లాండ్-న్యూజిలాండ్‌లను సంయుక్త విజేతలుగా ప్రకటించి ఉంటే హుందాగా ఉండేదని మరికొంతమంది నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. కేవలం బౌండరీలు ఎక్కువగా బాదారన్న కారణంగా ప్రపంచకప్ అందించడం ఎంత సిల్లీ అని అంటున్నారు. మొత్తం వరల్డ్ కప్ ఫైనల్ ఎంత ఉత్కంఠను రేపిందో.. బౌండరీ కౌంట్ నిర్ణయం అంత వివాదాన్ని రేపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story