టీడీపీలో ట్విట్టర్ వార్.. కేశినేని నాని వర్సెస్ బుద్ధా వెంకన్న
టీడీపీలో ట్విట్టర్ వార్ తారాస్థాయికి చేరింది. ట్విట్టర్ వేదికగా నేతల మధ్య దూషణల పర్వం కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా వరుస ట్వీట్లతో హాట్‌టాపిగ్గా మారిన టీడీపీ ఎంపీ కేశినేని నాని...తాజాగా మరో సంచలన ట్వీట్ చేశాడు. పార్టీలో కొంతమంది నాయకులపై తనకున్న అసంతృప్తిని నేరుగా అధినేత చంద్రబాబుకు తెలిసేలా పోస్ట్ పెట్టాడు. వద్దంటే చెప్పండి.. చంద్రబాబు గారు..నాలాంటి వాళ్లు పార్టీలో వద్దనుకుంటే వెంటనే చెప్పండి. ఎంపీ పదవికి, పార్టీకి వెంటనే రాజీనామా చేస్తా. నా లాంటి వాళ్లు కావాలనుకుంటే మీ పెంపుడు కుక్కలను కంట్రోల్ చేయండి’’ అని ట్వీట్ చేశారు. కేశినేని నాని తాజా పోస్టుతో టీడీపీ వర్గాల్లో గందరగోళం నెలకొంది. పార్టీలో కొంతమంది ముఖ్య నేతలతో విభేదాల వల్లే కేశినేని నాని పార్టీపై అసంతృప్తితో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.
విజయవాడ టీడీపీలో గత కొంతకాలంగా అంతర్గతపోరు నడుస్తుంది. కేశినేని నానికి..చంద్రబాబుకు నమ్మకస్తుడుగా ఉంటూ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న బుద్ధా వెంకన్నకు కొంతకాలంగా వైరం నడుస్తుంది.ఎన్నికల ముందు అంతర్గతంగా నడిచిన ఈ పోరు.. పార్టీ ఓటమి తరువాత మెల్లమెల్లగా రచ్చకెక్కుతూ వచ్చింది. తాజాగా నేతల మధ్య వర్గపోరు శ్రృతిమించింది. బహిరంగంగానే ఒకరిపై ఒకరు ట్విట్టర్ వేదికగా దూషణలు చేసుకుంటున్నారు. నిన్న ట్విట్టర్ వేదికగా కేశినేని నాని..ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న మధ్య ట్వీట్ల వార్ నడిచింది. నాలుగు ఓట్లు సంపాదించలేని వాడు నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేనివాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్ చేస్తున్నాడు. దౌర్భాగ్యం అంటూ కేశినేని నాని ట్వీట్ చేశారు.
కేశినేని నాని ట్వీట్‌కు అంతేస్థాయిలో బదులిచ్చాడు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. సంక్షోభం సమయంలో పార్టీ కోసం, నాయకుడి కోసం పోరాడేవాడు కావాలి. ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చేవాడు ప్రమాదకరం. నీలాగా అవకాశవాదులు కాదు. చనిపోయే వరకు చంద్రబాబు కోసం సైనికుడిలా పోరాడేవాడు కావాలి అంటూ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చాడు. కేశినేని నాని, బుద్ధ వెంకన్న మధ్య విభేదాలు పార్టీ అధిష్టానాన్ని, క్యాడర్‌ను అయోమయానికి గురి చేస్తుంది. అంతర్గత విభేదాల వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అటూ పార్టీ అధినేత చంద్రబాబు కూడా వీళ్ల అంతర్గపోరుపై సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తుంది.
కేశినేని నాని, బుద్ధ వెంకన్నల మధ్య విభేదాలతో క్యాడర్ కూడా రెండుగా చీలిపోయింది. పార్టీ మారుతున్నట్టు ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. కేశినేని నాని బీజేపీ గూటికి చేరతాడని బుద్ధ వర్గీయులు ప్రచారం చేస్తే..బుద్దా వెంకన్న వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నాడని కేశినేని వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. అయితే కేశినేని నాని..బుద్ధా వెంకన్న ఇద్దరూ టీడీపీ వలస పక్షులే. బుద్ధా వెంకన్న కాంగ్రెస్ ఉంచి టీడీపీలో చేరితే..కేశినేని నాని ప్రజారాజ్యం నుంచి సైకిల్ ఎక్కారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com