అక్కడ చేయి తడపందే.. పనిచేయరు

అక్కడ  చేయి తడపందే.. పనిచేయరు

చేయి తడపందే ఫైల్ కదలదు , బల్ల కింద బరువు పెడితే తప్ప పని కాదు , ఇక్కడ ఆస్తులు కొనాలన్నా , అమ్మాలన్నా దళారులను ప్రసన్నం చేసుకోవలసిందే , వేలకు వేలు లంచం ఇస్తేనే పని జరుగుతుంది. లేదంటే నెలల తరబడి ఆగాల్సిందే , ప్రజలకు మరింత పారదర్శకమైన సేవలందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన ధరణి రిజిస్ట్రేషన్ సేవలు.. సూర్యపేట జిల్లాలో అవినీతి కంపు కొడుతూ అబాసుపాలౌతుంది .

సూర్యపేట నియోజకవర్గంలో ప్రజలు తమ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం సూర్యపేట పట్టణంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంతో పాటు , చివ్వెంల మండల కేంద్రంలో పైలట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన ధరణి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు కూడా వెళుతున్నారు. అయితే ..ఇక్కడ ప్రజలకు పారదర్శకంగా సేవలందించాల్సిన అధికారులు నిబంధనల్లో ఉన్న లోపాలను అడ్డు పెట్టుకుని వేలకు వేలు లంచాలను దండుకుంటూ ప్రజలను జలగాల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు . ప్రజలు తమ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ దళారుల అవతారమెత్తిన దస్తావేజు లేఖరులను ప్రసన్నం చేసుకోవాలి. లేదంటే నెలల తరబడి రిజిస్ట్రేషన్‌ ఆపీసుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది.

రాష్ట్రంలో దస్తావేజు లేఖరుల వ్యవస్థ రద్దు చేసినా ఇక్కడ మాత్రం వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది , రిజిస్ట్రేషన్ల కోసం నేరుగా వచ్చే వారిని పక్కన పెట్టి దళారుల ద్వారా వచ్చిన వారికి అదికారులు వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు . దస్తావేజు లేఖరులను అడ్డం పెట్టుకుని అధికారులు క్రయవిక్రయ దారుల నుంచి భారీగా లంచాలు దండుకుంటున్నారు , అధికారుల అండదండలతో దళారుల అవతారమెత్తిన దస్తావేజు లేఖరులు బాహాటంగా ఎటువంటి జంకు బొంకు లేకుండా డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకునే వారు లేక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు . సూర్యపేట , చివ్వెంలలో కష్టపడి ఆస్తులు కొనుక్కోవడం ఒక ఎత్తైతే వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం మరో ఎత్తవుతుందని క్రయవిక్రయదారులు వాపోతున్నారు. ఒక వైపు.. స్టాంప్ వెండర్లు బాండ్ పేపర్ల కొరత పేరుతో 50 ది 100 కు , 100 ది 500 రూపాయలకు అమ్ముతుండగా.. మరోవైపు వి‌ఎల్‌టి టాక్స్ సర్టిఫికెట్ పేరుతో అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్లు చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ జరుగుతున్న అవినీతిని అరికట్టాలని కోరుతున్నారు ...

Tags

Next Story