ఆధార్‌ కార్డ్ అప్ డేట్ పేరుతో గ్రామ ప్రజలను మోసం చేసిన చీటర్

ఆధార్‌ కార్డ్ అప్ డేట్ పేరుతో గ్రామ ప్రజలను మోసం చేసిన చీటర్

ఆధార్‌ కార్డ్ అప్ డేట్ పేరుతో ప్రజలను మోసం చేసి వారి ఖాతాల నుంచి డబ్బులు కాజేసిన చీటర్ ను జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా, నెక్కొండ మండలంలోని సీతారాంపురానికి చెందిన అలువాల వినయ్‌కుమార్‌ బీ-టెక్‌ చదివాడు. కులాంతర వివాహం చేసుకొని చిలుపూరు మండలంలోని చిన్నపెండ్యాల గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్‌ సాక్షర భారత్ అభియాన్‌ ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో భాగంగా గ్రామాలు తిరుగుతూ నగదు రహిత సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు వినయ్. డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలు ఎలా ఉపయోగించాలో వివరిస్తున్నాడు. అయితే సులువుగా డబ్బులు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కాడు.

బీటెక్ చదువు ఇచ్చిన తెలివిని మోసాలు చేయడానికి ఉపయోగించుకున్నాడు వినయ్‌. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని అమాయకుల ఖాతాల నుంచి డబ్బులు కొట్టేయాలని ప్లాన్ వేశాడు. నమిలికొండ సర్పంచ్‌ను కలిసి ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్‌ సాక్షర భారత్ అభియాన్ గురించి వివరించాడు. నమిలికొండ గ్రామం వరంగల్‌ జిల్లా నుంచి జనగామకు మారినందున గ్రామస్థుల అధార్‌కార్డుల్లో జిల్లా పేరును మార్పిడిచేయాలని సర్పంచ్‌కు చెప్పి నమ్మించాడు. వినయ్‌ చెప్పింది నిజమని నమ్మిన సర్పంచ్‌ గ్రామంలో చాటింపు వేయించాడు. దీంతో గ్రామస్థులు ఆధార్‌కార్డుతో వచ్చారు. ఆధార్‌ వివరాలను నమోదు చేసుకోవడంతో పాటు వేలిముద్రలను తీసుకొని ఆన్‌లైన్‌లో డీజీ పేయాప్‌ ద్వారా ఒక్కొక్కరి ఖాతా నుంచి వారికి తెలియకుండా 600-1000 వరకు మొత్తం రూ. 2 లక్షల 59 వేలను నిందితుడు తన ఖాతాలోకి మార్చుకున్నాడు.

వినయ్ చేసిన మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ తమ ఖాతాల నుంచి డబ్బు లు కట్‌ అయినట్లు మెసేజ్‌లు రావడంతో బాధితులు సర్పంచ్‌ను అడిగారు. వినయ్ కు ఫోన్‌ చేస్తే ఈనెల 9న వస్తానని నమ్మబలికాడు. కానీ గ్రామానికి వెళ్లలేదు. మరోవైపు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్‌ రాని రావడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐదు రోజులుగా సీఐ రాజిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నిందితుడి కోసం గాలించారు. చివరకు చిన్నపెండ్యాలలో వినయ్ ను పట్టుకున్నా రు. పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. గ్రామాల్లో డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలపై అవగాహన కల్పి స్తామంటూ వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. వేలిముద్రను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదన్నారు.

Tags

Next Story