ఆ భూముల వ్యవహారంపై విచారణ జరిపిస్తాం : మంత్రి వెల్లంపల్లి
సదావర్తి భూముల విషయంలో గత ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందన్న వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఆరోపణలతో సభలో గందరగోళం నెలకొంది. అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ అరోపణలపై మాజీ సీఎం, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. తప్పుడు సమాచారంతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటి విలువ తొలుత 5వేల కోట్లని.. తర్వాత 13 వందల కోట్లని అసత్య ప్రచారం చేశారని దుయ్యబట్టారు. వైసీపీ నిర్వాకంతో ఈ భూములు ఎవరివనే దానిపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తోందని గుర్తుచేశారు. ఈ భూములపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని చంద్రబాబు.
చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సదావర్తి భూముల వ్యవహారంపై విచారణ జరిపిస్తామని తెలిపారు. విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తామని సభలో ప్రకటించారు.
కియా మోటార్స్ ఏర్పాటు సభలో మరోసారి చర్చకు వచ్చింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చాలా తెలివైనా వారు హ్యాట్సాప్.. మనస్పూర్తిగా అభినందిస్తున్నా అంటూ సైటైర్స్ వేశారు చంద్రబాబు. 2009లో వైఎస్సార్ చనిపోతే.. 2017లో ఆయన ఆత్మ కియా సీఈవో దగ్గరకు వెళ్లిందా అంటూ కౌంటర్ వేశారాయన. మంచిగా కథలు చెబుతున్నారు.. ఆసత్యాలను సత్యాలుగా చెప్పేస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు చంద్రబాబు..
చంద్రబాబు విమర్శలపై మంత్రి బుగ్గన స్పందించారు. కియా సీఈవో జూన్ 13న జగన్‌కు లేఖ రాశారని తెలిపారు. 2007లో వైఎస్‌ను కలిశానని.. ఏపీలో ప్లాంట్ పెట్టమని తమను రిక్వెస్ట్ చేసినట్లు ఆయన అందులో రాసినట్టు చెప్పారు.
రాష్ట్రాభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వానికి దృష్టి లేక తమ హయాంలో జరిగిన అభివృద్ధిపై అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com