ఎంత కష్టం.. ప్రవహించే నదిలో ప్లాస్టిక్ కవర్లో కూర్చుని విద్యార్థులు పాఠశాలకు.. వీడియో

ఎంత కష్టం.. ప్రవహించే నదిలో ప్లాస్టిక్ కవర్లో కూర్చుని విద్యార్థులు పాఠశాలకు.. వీడియో

ఇంటికి నాలుగైదు కిలో మీటర్ల దూరంలో ఉన్న స్కూలుకు పంపించాలంటే తల్లి దండ్రులు ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు. చదువు విద్యార్ధుల భవితవ్యాన్ని నిర్ణయిస్తుందని తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు చేపడుతుంది. కానీ ఇక్కడ విద్యార్థులు ప్రమాదమని తెలిసి కూడా చదువుకోవడానికని ఏటికి ఎదురీది మరీ స్కూలుకు వెళుతున్నారు. ప్లాస్టిక్ కవర్లో కూర్చుని నదీ ప్రవాహాన్ని దాటి బడికి వెళుతున్నారు. వియత్నాంలోని డీన్ బీన్‌లోని హువోయి హా గ్రామానికి చెందిన విద్యార్థులు స్కూలుకు వెళ్లాలంటే ప్రవహించే నదిని దాటాలి. ఆ నదికి వంతెన కూడా లేదు. ఓ గజ ఈతగాడి సాయంతో ప్లాస్టిక కవర్లో పిల్లాడిని కూర్చోబెట్టి బడికి పంపుతున్నారు తల్లిదండ్రులు. అలా కూడా చదువుకోవడానికి వెళుతున్నారంటే వారికి చదువు పట్ల ఎంత ఆసక్తి వుందో అర్థం చేసుకోవచ్చు.

ఈ విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినా సత్వర చర్యలు చేపట్టడం లేదని గ్రామ పెద్ద వాపోతున్నారు. రోజుకి ఈ విధంగా 50 మంది విద్యార్థులు స్కూలుకు వెళుతున్నారు. కవర్లో కూర్చుని నదిని దాటేందుకు విద్యార్ధులు భయపడినా వేరే మార్గం లేక వెళుతున్నారు. చిన్న పొరపాటు జరిగినా విద్యార్థుల నిండు జీవితం నదిలో కొట్టుకుపోవలసిందే అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇదివరకు గ్రామస్థులే వెదురు కర్రలతో వంతెన నిర్మించుకుని నదిని దాటే వెళ్లే వారు. కానీ ఇప్పుడది వాడుకలో లేదు. దాంతో వారి కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి. విద్యార్థుల వెతలను మీడియా వెలుగులోకి తీసుకురావడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తమ కష్టాలు తీరి మంచి రోజులు రానున్నాయని గ్రామస్తుల ఆశాభావంతో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story